ఎంఐఎంపై తలసాని సంచలన వ్యాఖ్యలు
ఎంఐఎం నేతలు దేశమంతా తిరిగి పోటీ చేస్తూ ఎవరికీ లాభం చేస్తున్నారో తెలియదా? ఎవరు పడితే వాళ్ళు మాట్లాడడానికి మేము అలకగా దొరికామా? అంటూ తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ఆ పార్టీకి ఉన్న బలం ఎంత?. మా బలం ఎంత?. వాళ్ళు టీఆర్ఎస్ ఏమి చేయగలుగుతారని ప్రశ్నించారు. అసెంబ్లీలో టీఆర్ఎస్ తోక ఎలా తొక్కాలో తమకు తెలుసంటూ ఎంఐఎం శాసనసభాపక్ష నాయకుడు అక్భరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై తలసాని శ్రీనివాసయాదవ్ స్పందించారు. ఎంఐఎం, బిజెపి నేతల తీరుపై తలసాని మండిపడ్డారు. ఆయన బుధవారం నాడు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. 'కేంద్ర మంత్రులు మామూలు సమయం లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ ఎన్నికలు రాగానే విమర్శిస్తున్నారు. బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడుతున్నారు.
దేశ సరిహద్దుల్లో సర్జికల్ స్ట్రైక్ చేస్తారని బండి సంజయ్ కు తెలియదు. హైదరాబాద్ లో అ సాంఘిక శక్తులు చెలరేగుతుంటే కేంద్రం ఏం చేస్తోంది ..వైఫల్యాన్ని ఒప్పుకుని సర్జికల్ స్ట్రైక్ అంటున్నారా ?బీజేపీ నేతలు తాము ఏం చేస్తారో చెప్పక మా మేనిఫెస్టో ను తప్పు బడుతున్నారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఓ ఐదు లక్షలైనా హైదరాబాద్ కు తెచ్చారా ? వరదల్లో ప్రజలు భాధ పడుతుంటే కిషన్ రెడ్డి ప్రోటో కాల్ గురించి మాట్లాడుతారు. కరీం నగర్ లో పుట్టిన బండి సంజయ్ కు హైదరాబాద్ గురించి ఏం తెలుసు ?. బీజేపీ నేతలు మదం పట్టి కెసిఆర్ కుటుంబం పై మాట్లాడుతున్నారా?. బండి సంజయ్ వ్యాఖ్యల గురించి తెలియదని హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఎలా అంటారు ?శాంతిని కోరుకునే ప్రజలు బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యల గురించి ఆలోచించాలి.
కాంగ్రెస్ మేనిఫెస్టో లో అసాధ్యమైన హామీలిచ్చారు.కాంగ్రెస్ ను చూస్తే జాలి వేస్తోంది. 25 వేల వరద సాయం ఇస్తామంటున్న బీజేపీ నేతలు కేంద్రం నుంచి జీవో ఇప్పించాలి. కాంగ్రెస్ నేతలకు తెలివి తేటలు దిక్కు దివాణం లేదు. .ప్రకాష్ జవదేకర్ ,స్మృతి ఇరానీ వాళ్ళ వాళ్ళ నగరాల్లో ఏమైనా మాట్లాడుకోవచ్చు ..హైదరాబాద్ తో వాళ్లకు ఏం పని ?ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు ?ఒక్క నయాపైసా ను కూడా కేంద్రం నుంచి తెప్పించలేని నేతలు సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారు. మేము బాధ్యత గా హుందా గా మాట్లాడాలని సీఎం కోరుకుంటారు .అందుకే నోరు కట్టేసుకుంటున్నాం. హైదరాబాద్ 20 ,30 యేండ్లు వెనక్కి వెళ్లాలని బీజేపీ నేతలు కోరుకుంటున్నారు. ఈ పరిస్థితి ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించం' అని వ్యాఖ్యానించారు.