Telugu Gateway
Politics

ఏదైనా హ్యాక్ చేయోచ్చు

ఏదైనా హ్యాక్ చేయోచ్చు
X

ఎలాన్ మస్క్ ఏమి చెప్పినా సంచలనమే. ప్రపంచ నంబర్ వన్ సంపన్నుడు అయిన మస్క్ మాటలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అందరి కంటే ఎంతో ముందు చూపుతో ఆలోచించటం...కొత్త కొత్త సాంకేతికత విషయంలో కూడా ఎలాన్ మస్క్ ఎవరికీ అందనంత వేగంతో ఉంటారు. అందుకే ఆయన ప్రపంచ నంబర్ వన్ సంపన్నుడిగా నిలిచారు అంటే ఏ మాత్రం అతిశయోక్తికాదు అనే చెప్పాలి. ఇప్పుడు ఇది అంతా ఎందుకు అంటే ఈవీఎం లపై ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు భారత్ లో కూడా పెద్ద దుమారం రేపుతున్నాయి. ఈవీఎంలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లేదా మనుషులు హ్యాక్ చేయటానికి అవకాశం ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించి పేపర్ బ్యాలట్ ను తీసుకురావాలని అన్నారు. ఈ ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

ప్యూర్టోరికో ప్రైమరీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు సంబంధించి వందల సంఖ్యలో ఓటింగ్ అవకతవకలు జరిగాయని అమెరికా అధ్యక్ష అభ్యర్థి కెన్నెడీ జూనియర్ ఎక్స్‌ ఓ పోస్ట్ చేశారు. అదృష్టవశాత్తూ పేపర్ ట్రయిల్ ఉండడంతో సమస్యను గుర్తించి ఓట్ల లెక్కింపు సరిచేశారని తెలిపారు. పేపర్ ట్రయిల్ లేని ప్రాంతాల్లో ఏమి జరుగుతుందో ఊహించండని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఎలాన్ మస్క్ ఈవీఎంలను తొలగించాలని...వీటిని హ్యాక్ చేసే అవకాశం ఉంది అన్నారు. గతంలో భారత్ లో కూడా ఈవీఎంలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు ఈసీ వీటిని తోసిపుచ్చుతూ వచ్చింది. అయితే ఎలాన్ మస్క్ ట్వీట్ దుమారం రేపటంతో కేంద్ర మాజీ ఐటి శాఖ మంత్రి, బీజేపీ నేత రాజీవ్ చంద్ర శేఖర్ ఈ అంశంపై స్పందించారు.

మస్క్ అన్నిఅంశాలను ఒకే గాటన కట్టి మాట్లాడారు అని...భారత్ లో ఈవీఎం లను హ్యాక్ చేయటం సాధ్యం కాదు అన్నారు. ఎందుకంటే భారత్ లో ఈవీఎంలు అటు బ్లూ టూత్, వైఫై , ఇతర ఏ ఇంటర్నెట్ తో అనుసంధానం అయి ఉండవు అన్నారు. వాటిని అలాగే డిజైన్ చేసినట్లు తెలిపారు. అయితే అమెరికాలో వాడే ఈవీఎంలను ఇంటర్నెట్ తో అనుసంధానం చేస్తారు అన్నారు. మస్క్ చెప్పినట్లు అమెరికా, ఇతర దేశాల్లో హ్యాకింగ్ సాధ్యం అవుతుందేమో కానీ...భారత్ లో కాదు అన్నారు. అయితే రాజీవ్ చంద్ర శేఖర్ వివరణపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ ఏదైనా హ్యాక్ చేయవచ్చు అంటూ రిప్లై ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ అంశంపై స్పందించారు. భారత్ లో ఈవీఎం లు బ్లాక్ బాక్స్ లుగా మారాయి అన్నారు. వ్యవస్థల్లో పారదర్శకత లోపించటం పెద్ద సమస్యగా మారింది అన్నారు. ఈవీఎంలను తనిఖీ చేసే అవకాశం ఎవరికీ ఇవ్వటం లేదు అని విమర్శించారు.

Next Story
Share it