బల పరీక్ష లో ఏక్ నాథ్ షిండే నెగ్గారు
ఆ పని కూడా పూర్తయింది. మహారాష్ట్రంలో ఏక్ నాథ్ షిండే విశ్వాస పరీక్ష కూడా పూర్తి చేసుకున్నారు. దీంతో శివసేన రెబల్-బిజెపి సంకీర్ణ సర్కారుకు రంగం సిద్ధం అయింది. ఎవరూ ఊహించని స్థితిలో బిజెపి, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర రాజకీయాల్లో ఇది ఓ పెద్ద సంచలనంగానే చెప్పుకోవచ్చు. ఆదివారం నాడు స్పీకర్ ఎన్నిక పూర్తి చేసుకున్న మహారాష్ట్ర అసెంబ్లీ సోమవారం నాడు బల పరీక్ష ను ముగించింది. ఏక్‌నాథ్ షిండే సారథ్యంలో కొత్తగా కొలువుదీరిన శివసేన–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి అనుకూలంగా 164 ఎమ్మెల మద్దతు లభించింది. విశ్వాస పరీక్షలో ప్రతిపక్షానికి 99 ఓట్లు పోలయ్యాయి. ఎమ్మెల్యేల లెక్కింపు ద్వారా మెజారిటీని తేల్చారు. అంతకుముందు సీఎం ఏక్‌నాథ్ షిండేను శివసేన శాసనసభా పక్ష నేతగా అసెంబ్లీ స్పీకర్ గుర్తించారు. చిఫ్‌విప్‌గా తిరుగుబాటు నేత భరత్ గొగవాలేను నియమించారు.
అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో మహారాష్ట్ర నూతన స్పీకర్‌గా ఆదివారం బీజేపీ అభ్యర్థి రాహుల్ నార్వేకర్ ఎన్నికైన విషయం తెలిసిందే. ఆయనకు 164 ఓట్లు రాగా, మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) అభ్యర్థి, శివసేన ఎమ్మెల్యే రాజన్ సాల్వీకి కేవలం 107 ఓట్లు పోలయ్యాయి.ఇదిలా ఉంటే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలల తర్వాత అందరూ మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ ప్రభుత్వం అంతకు మించి ఎక్కువ సాగం కొనసాగే ఛాన్స్ లేదని..కేబినెట్ విస్తరణ పూర్తయిన తర్వాత విడిపోయిన ఎమ్మెల్యేల్లో విభేదాలు రావటం, వారు తిరిగి వెనక్కి రావటం పక్కా అంటూ తేల్చేశారు. అయితే ఇది ఏక్ నాథ్ షిండే సర్కారుకు ఝలక్ ఇవ్వటానికి చేసిన ప్రకటనా లేక నిజంగానే ఇలా జరుగుతుందా అన్నది వేచిచూడాల్సిందే.