ముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే

శివసేనలో చిచ్చుకు ప్రధాన కారకుడైన సీనియర్ నేత ఏక్ నాథ్ షిండే గోవా నుంచి ముంబయ్ కు చేరుకున్నారు. కొత్త ప్రభుత్వం శుక్రవారం నాడు కొలువుదీరే అవకాశం ఉందని వార్తలు వస్తున్న తరుణంలో ఆయన రాక కీలకంగా మారింది. ఆసమ్మతి గ్రూపులోని ఏక్ నాథ్ షిండేకు ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు మరికొంత మంది కీలక నేతలకు మంత్రి పదవులు కూడా ఖరారు అయ్యాయని జోరుగా ప్రచారం సాగుతోంది. బిజెపి నేత ఫడ్నవీస్ గవర్నర్ ను కలసి తమకు పూర్తి మెజారిటీ ఉందని..ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. అ వెంటనే శుక్రవారం నాడు కొత్త ప్రభుత్వం కొలువు దీరేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. అసమ్మతి ఎమ్మెల్యేలపై శివసేన కీలకనేత, ఎంపీ సంజయ్ప్ రౌత్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వారంతా ఉద్థవ్ ఠాక్రేకు వెన్నుపోటు పొడిచారంటూ ఆరోపించారు. శివసేన అధికారం కోసం పాకులాడటం లేదని..వచ్చే ఎన్నికల్లో సొంతంగా అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
రౌత్ వ్యాఖ్యలను తిరుగుబాటు గ్రూపు తప్పుపట్టింది. శివసేనలో సంక్షోభానికి మూల కారకుడు సంజయ్ రౌత్ అనేది ఆ పార్టీ రెబల్స్ ఆరోపణ. అంతేకాదు ఎన్సీపీతో కుమ్మక్కై ఆయన తీరని ద్రోహం చేశాడంటూ మండిపడుతోంది. ''మేం ఎవరినీ వెన్నుపోటు పొడవలేదు. ఉద్దవ్ థాక్రే అంటే మాకు విపరీతమైన గౌరవం ఉంది. సంజయ్ రౌత్ ఎన్సీపీకి విధేయుడిగా వ్యవహరించాడు. అందుకే శివసేనకు వెన్నుపోటు పొడిచాడు'' అని రెబల్స్ తరపున ఎమ్మెల్యే దీపక్ కేసర్కర్ గురువారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. 'ఉద్దవ్ థాక్రే కుటుంబానికి మేం వ్యతిరేకం కాదు. మహా వికాస్ అగాఢితో తెగదెంపులు చేసుకుంటే మేం ఆయనతో చర్చించేవాళ్లం. ఆయనకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లేవాళ్లం కూడా కాదు. ఇప్పటికీ మేం థాక్రేను గౌరవిస్తున్నాం'' అని వ్యాఖ్యానించటం విశేషం.