Telugu Gateway
Politics

ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
X

కులం..పార్టీ..డబ్బు..జెండా కాదు..మనిషిని గుర్తుపెట్టుకోండి

నేను గాయపడుతుండొచ్చు..కానీ మనస్సు మార్చుకోలేదు

కళ్యాణలక్ష్మీ, పెన్షన్లు పేదరికానికి పరిష్కారం కాదు

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్కారు ఎంతో ప్రతిష్టాతక్మకంగా చెప్పుకుంటున్న పథకాలను కూడా ఎద్దేవా చేశారు. 'పరిగ ఎరుకుంటే రాదు పంట పండితే వస్తుంది అనే సామెత ఉంది అలాగే కళ్యాణ లక్ష్మీ, పెన్షన్, రేషన్ కార్డ్ లు పేదరికానికి పరిష్కారం కాదు.. తన కాళ్ళమీద తాను నిలబడే సత్తా తీసుకురావాలి. నేను చేవ ఉన్న దాన్ని, సాహసం ఉన్నవాడిని, నేను పని చేయగలను అనే కాన్ఫిడెన్స్ రావాలి. ' అని వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజక వర్గం వీణవంక మండలం రైతు వేదికలను రైతులకు అంకితం చేసిన సందర్భంగా మాట్లాడిన ఈటెల రాజేందర్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడి పోవచ్చు కానీ అంతిమ విజయం వాటివే.. కులం, డబ్బు, పార్టీ, జెండా కాదు మనిషి ని గుర్తుపెట్టుకోండి.

నా లాంటి వాడు కూడా మళ్ళీ మీ ముందుకు వచ్చి దేహీ అనే పరిస్థితి మంచిది కాదు అంటూ వ్యాఖ్యానించి కలకలం రేపారు. అసలు ఈటెల రాజేందర్ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు అన్నది చర్చనీయాంశంగా మారింది. "పెట్టింది అంతా చెప్పుకో వద్దు, చేసిందంతా చెప్పుకోవద్దు. అది గుండెల్లో ఉంటుంది.ధర్మం న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు కానీ శాశ్వతంగా ఓడిపోదు.కులం, డబ్బు, పార్టీ, జెండా కాదు మనిషిని గుర్తుపెట్టుకోండి.నాకు తెలుసు నేను ఇబ్బంది పడుతూ ఉండొచ్చు గాక, నేను గాయపడుతుండచ్చు గాక, నేను మనసును మార్చుకోలేదు. పెట్టిన చెయ్యి ఆగదు. చేసే మనిషిని నేను ఆగను.నేను ఉన్నంతవరకు 20 ఏళ్ల ప్రస్థానంలో నన్ను గొప్పగా ఎంత ఎత్తుకు ఎత్తారో నాకు తెలుసు.తప్పకుండా నేను ఉన్నంతవరకు మావాళ్లు ఉన్నంతవరకు మీ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాను". అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రజలు గుర్తిస్తేనే మనం ఇక్కడ ఉన్నాము అని ఇక్కడ ఉన్న రాజకీయనాయకులు అంతా గుర్తు పెట్టుకోండి. మనకు ప్రజల గుర్తింపు ఉండాలి. ఊరంతా ఒక దారి అయితే ఊసరవల్లి కి ఒక దారి అన్నట్లు కొంతమంది ఉంటారు. మహాభారతంలో కౌరవులు, ధుర్యోధనుడు ఉండబట్టే పాండవులకు అంత పేరు వచ్చింది. అలాగే రామాయణంలో కూడా రాముడు ఉన్నాడు.. రావణుడు ఉన్నాడు.. అలాగే మన సమాజంలో కూడా అందరూ ఉంటారు. అందరూ ఒకే విధంగా ఉండరు. సమాజం ఆనాటి నుండి ఈనాటి వరకు మొత్తం ఒకటిగా ఉండదు, ఉంటే అది సమాజం కాదు. నాయకులంటే భారీ ఆకారంతో, అభరణాలతో, కులంతో పని ఉండదు ప్రజల కన్నీళ్ళు చూసి స్పందించే వాడే నిజమైన నాయకుడు, నిజమైన మనిషి. ' అంటూ వ్యాఖ్యానించారు.

Next Story
Share it