'మహారాష్ట్రలో కలకలం' ..మంత్రి అరెస్ట్
రాష్ట్రపతి ఎన్నికలపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే ఆయన్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. బిజెపితో బీహార్ సీఎం నితీష్ కుమార్ తెగతెంపులు చేసుకుంటే ఆయన రాష్ట్రపతి అభ్యర్ధిత్వానికి మద్దతు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని మాలిక్ ప్రకటించారు. ఇది జరిగిన కొన్ని గంటల్లో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం లావాదేవీలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఆయన్ను ఈడీ అధికారులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు. దీనిపై మహారాష్ట్రలోని అధికార శివసేన మండిపడుతోంది. బుధవారం ఉదయం మంత్రి నవాబ్ మాలిక్ ను ఆయన నివాసంలో విచారించిన అధికారులు తర్వాత ఈడీ కార్యాలయానికి తీసుకెళ్ళారు. అనంతరం అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఈ కేసు విచారణకు సంబంధించి బుదవారం ఉదయం 6 గంటలకు నవాబ్ మాలిక్ ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు.. ఓ గంట సేపు ప్రశ్నించిన అనంతరం 7:30 నిమిషాలకు ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లి ప్రశ్నించారు. అయితే ఆ సమయంలో నవాబ్ మాలిక్ ఈడీకి సహకరించలేదని చెబుతున్నారు.
అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్‌తో పాటు పరారీలో ఉన్న ఉగ్రవాద ఫైనాన్సర్ దావూద్ ఇబ్రహీం, అతని సోదరుడు అనీస్, ఇక్బాల్, సహాయకుడు చోటా షకీల్, ఇతరులపై నమోదైన కేసులో ఈడీ ముందు హాజరు కావాలని నవాబ్ మాలిక్‌కు ఇదివరకే సమన్లు జారీ అయ్యాయని అంటున్నారు. ఈ విషయమై గత వారం ఈడీ వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈడీ దాడులను ఆధారం చేసుకుని ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. దావూద్ ఇబ్రహీం సహాయకుడితో పాటు ఆయన సోదరి హసీనా పార్కర్‌తో నవాబ్ మాలిక్ డీల్స్ కుదుర్చుకున్నట్లు బలమైన ఆరోపణలు ఉన్నాయి. దావూద్ మనీలాండరింగ్ కేసులో భాగంగా మంత్రిని అదుపులోకి తీసుకున్నారు. నవాబ్ మాలిక్ పలు చోట్ల వివాదస్పద ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఇవి అన్నీ కూడా దావూద్, అతని అనుచరుల కోసం మాలిక్ కొన్నట్లు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.