రోజుకు వంద కోట్లు పట్టుకుంటున్న ఈసీ
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకోవడానికి ఉచితంగా మద్యం పంపిణి చేస్తాయనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ముఖ్యంగా గ్రామీణ..పట్టణ ప్రాంతాల్లో కొంత మంది ఓటర్లను టార్గెట్ చేసుకుని మద్యం సరఫరా ఉంటుంది. ఎన్నో ఎన్నికల నుంచి ప్రజలు ఈ తంతును చూస్తున్నారు. కాకపోతే ఇప్పుడు పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారినట్లు కనిపిస్తోంది. మద్యం తో పాటు ఈ ఎన్నికల్లో డ్రగ్స్ కూడా కీలక పాత్ర పోషించబోతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (సిఈసి) బయటపెట్టిన వివరాలు తెలియ చేస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల వేళ నగదు, మద్యం, ఆభరణాలు, ఇతర వస్తువులు కలుపుకుని ఈసి స్వాధీనం చేసుకున్న వాటి మొత్తం విలువ 3475 కోట్ల రూపాయలు మాత్రమే. అయితే ఇక్కడ కీలక విషయం ఏమిటి అంటే ఇంకా దేశంలో తొలి దశ ఎన్నికలు కూడా పూర్తి కాలేదు కానీ...మార్చి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 4658 కోట్ల రూపాయల విలువ చేసే మద్యం, ఆభరణాలు, ఇతర వస్తువులు, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు సిఈసి వెల్లడించింది.
ఇందులో షాకింగ్ పరిణామం ఏమిటి అంటే అన్నిటికంటే ఎక్కువ మొత్తంలో డ్రగ్స్ ఉండటమే. ఏకంగా 2069 కోట్ల రూపాయల డ్రగ్స్ స్వాధీనం చేసుకుంటే...మద్యం విలువ 489 కోట్ల రూపాయలు, నగదు 395 కోట్ల రూపాయలు ఉన్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 19 న దేశంలో తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఏడు దశల్లో జరిగే ఎన్నికలు జూన్ 1 న ముగిస్తాయి. ఫలితాలు జూన్ 4 న వెల్లడి అవుతాయి. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న దాని ప్రకారం చూస్తే రోజుకు వంద కోట్ల రూపాయల లెక్కన ఎన్నికల్లో వివిధ రకాల వస్తువులు పట్టుబడినట్లు. ఇవి దొరికినవి మాత్రమే. దొరక్కుండా ఎన్నికల్లో అభ్యర్థులు పంచే నగదు. వస్తువులు పెద్ద ఎత్తున ఉంటాయనే విషయం కూడా తెలిసిందే. దేశంలో మొత్తం ఏడు దశల ఎన్నికల పూర్తి అయ్యే నాటికీ అధికారికంగా దొరికే వాటి మొత్తం విలువు ఇంకెంత పెరుగుతుందో చూడాల్సిందే.