Telugu Gateway
Politics

నువ్వు ఇటు వస్తే ...నేను అటు వస్తా

నువ్వు ఇటు వస్తే ...నేను అటు వస్తా
X

తెలంగాణ రాజకీయం కొత్త కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికి బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాలపై రెండు ప్రధాన పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ లు కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. ఫలితం ఎలా ఉన్నా ఇక్కడ పోటీ మాత్రం అందరిలో ఆసక్తి రేపుతోంది. తొలుత మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తాను సీఎం కెసిఆర్ పై గజ్వేల్ లో పోటీ చేస్తానని ప్రకటించారు...ప్రకటించినట్లే బరిలో దిగారు కూడా. కెసిఆర్ పోటీ చేస్తున్న మరో నియోజకవర్గం కామారెడ్డి బరిలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా పోటీ చేస్తుండటంతో ఈ రెండు నియోజకవర్గాల ఎన్నిక దేశ వ్యాప్తంగా ఉత్సుకత రేపుతోంది. ఆదివారం నాడు గజ్వేల్ లో పర్యటించిన ఈటల రాజేందర్ సంచనల వ్యాఖ్యలు చేశారు. మంత్రి హరీష్ రావు గజ్వేల్ లో ప్రచారం చేస్తే.. హరీష్ కు వ్యతిరేకంగా తాను సిద్దిపేటలో ప్రచారం నిర్వహిస్తానని ఈటల హెచ్చరించారు. సహజంగా కెసిఆర్ తరపున గజ్వేల్ ప్రచార బాధ్యతలు హరీష్ రావు కూడా పర్యవేక్షిస్తారు.

ఈ తరుణంలో ఈటల మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సొంత నియోజకవర్గం గజ్వేల్ ను కూడా అభివృద్ధి చేయలేదు అని విమర్శించారు. పదేళ్లలో కేసీఆర్ కు గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు గుర్తు రాలేదని.. ఎన్నికల ముందు గుర్తొస్తున్నారని ఎద్దేవా చేశారు. తాను ఇక్కడ పోటీ చేస్తున్నాని తెలియగానే బీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఈటల అన్నారు. కేసీఆర్ బాధితులకు తాను అండగా నిలవనున్నట్లు తెలిపారు. గజ్వేల్ లో తిరిగిన ప్రతి చోట వాళ్ల ఓట్లు తనకే వేస్తానని చెబుతున్నారని.. అక్కడే కేసీఆర్ ఓటమి ఖాయమైందని అన్నారు. తాను కూడా కెసిఆర్ బాధితుడిని అని ఈటల వ్యాఖ్యానించారు.

Next Story
Share it