Telugu Gateway
Politics

కెసీఆర్ పై పోటీకి సై అంటున్న ఈటెల రాజేంద‌ర్

కెసీఆర్ పై పోటీకి సై అంటున్న ఈటెల రాజేంద‌ర్
X

మాజీ మంత్రి, హూజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు భ‌విష్య‌త్ లేదు అనుకునేవారు పెద్ద సంఖ్యలో ఉన్నార‌న్నారు. బిజెపిలో మ‌న‌స్పూర్తిగానే ఉన్నానని..త‌న‌కు పార్టీలో ఎవ‌రితో విభేదాలు లేవ‌ని తెలిపారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ముఖ్య‌మంత్రి కెసీఆర్ పై పోటీకి సిద్ధం అన్నారు. లేక‌పోతే త‌న నియోజ‌క‌వ‌ర్గం హుజూరాబాదే అన్నారు. ఈటెల రాజేంద‌ర్ గురువారం నాడు తెలంగాణ జ‌ర్న‌లిస్టు యూనియ‌న్ నిర్వ‌హించిన మీట్ ద ప్రెస్ లో పాల్గొని ప‌లు అంశాల‌పై స్పందించారు. రైతుబంధు డ‌బ్బులు కెసీఆర్ ఇంట్లోనుంచి ఇవ్వ‌టం లేద‌న్నారు. కెసీఆర్, త‌న‌లాంటి వారికి రైతు బంధు అవ‌స‌ర‌మా అని తాను గ‌తంలో ప్ర‌శ్నించాన‌ని తెలిపారు. రైతు కూలీలు, కౌలు రైతుల‌ను కెసీఆర్ పూర్తిగా విస్మ‌రించార‌ని త‌ప్పుప‌ట్టారు. తాను మంత్రివ‌ర్గంలో ఉన్న స‌మ‌యంలో కూడా మంత్రివ‌ర్గ స‌మావేశానికి ముందే నిర్ణ‌యాలు అయిపోయేవ‌న్నారు. సీఎం కెసీఆర్ ను క‌లిసేందుకు త‌న‌తోపాటు చాలా మంది ప్ర‌గ‌తి భ‌వ‌న్ కు వెళ్ళిన‌ప్పుడు అనుమ‌తించ‌క‌పోవ‌టంతోనే త‌మ ఆత్మాభిమానం దెబ్బ‌తిన్న‌ద‌న్నారు.

మెజార్టీ టీఆర్‌ఎస్‌ నేతలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. థర్డ్ ఫ్రంట్ సంగతి అటుంచి.. ముందు రాష్ట్రాన్ని కేసీఆర్ చక్కదిద్దాలని హితవు పలికారు. తాను కాంగ్రెస్‌లోకి వెళ్తానని కేసీఆరే ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. ఏడున్నరేళ్లలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదన్నారు. ఎస్సీలపై ప్రేమ ఉంటే ఇప్పుడు దళితబంధు అమలు చేయాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. ఓట్ల కోసం త‌ప్ప‌..ద‌ళితుల‌పై ప్రేమ‌తో ద‌ళిత‌బంధు ప‌థ‌కం తేలేద‌న్నారు. హుజూరాబాద్ తీర్పుతోనే కెసీఆర్ ఫాంహౌస్ ను వీడి బ‌య‌ట‌కు వ‌చ్చార‌న్నారు. తెలంగాణ‌లో భూముల‌పై కెసీఆర్ అజ‌మాయిషి కోస‌మే ధ‌ర‌ణి తెచ్చార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జ‌ల్లో చైత‌న్యం చంపాల‌ని కెసీఆర్ కంక‌ణం క‌ట్టుకున్నార‌ని అన్నారు.

Next Story
Share it