Telugu Gateway
Politics

సొంత పార్టీ నాయ‌కుల‌నే కొనుక్కుంటున్నారు

సొంత పార్టీ నాయ‌కుల‌నే కొనుక్కుంటున్నారు
X

అధికార టీఆర్ఎస్ పై బిజెపి నేత ఈటెల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్ఎస్ సొంత పార్టీ నాయ‌కుల‌ను కొనుక్కొనే ప‌రిస్థితికి దిగ‌జారింద‌న్నారు. టీఆర్ఎస్ మ‌ళ్లీ అధికారంలోకి రాదని తేల్చిచెప్పారు. ఇది అహంకారానికి...ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వానికి మ‌ధ్య జ‌రిగే పోరాటం అని వ్యాఖ్యానించారు. ఈటెల రాజేంద‌ర్ శ‌నివారం నాడు హుజూరాబాద్ లో బిజెపి రాష్ట్ర ప్రెసిడెంట్ బండి సంజ‌య్ తో క‌ల‌సి మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఎన్ని కుట్ర‌లు చేసినా..ఎన్ని కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టినా ఆ పార్టీకి ఓట‌మి త‌ప్ప‌ద‌న్నారు. చ‌రిత్ర నిర్మాతలు ప్రజలేనని, వ్యక్తులు కాదన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం, ఆత్మ గౌరవం ప్రశ్నార్థకంగా మారాయని ఈటల పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు బంద్ చేయడానికి మీ తాత జాగీరు కాదని ప్రభుత్వాన్ని ఈటెల హెచ్చ‌రించాచారు. హుజురాబాద్‌లో కాషాయ జెండా ఎగురబోతోందని ఈటల ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రజాబలం ముందు ఏదీ నిలబడదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్‌కు డిపాజిట్‌ రాదని ఈటల అన్నారు. చింతమడక తరహాలో హుజురాబాద్‌లో పది లక్షలు ఇవ్వాలని ఈటల డిమాండ్ చేశారు. ఎన్నికలు కోరుకున్నది టీఆర్‌ఎస్‌ మంత్రులేనని, తాను రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది వాళ్లేనని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను యాచ‌కులుగా మార్చే పాల‌న ఆగుతోంద‌ని విమ‌ర్శించారు. బండి సంజ‌య్ మాట్లాడుతూ భూములు అమ్మే అధికారం ఎవరిచ్చార‌ని ప్ర‌శ్నించారు. ఈటెల రాజేంద‌ర్ బిజెపిలో చేరిన‌ప్ప‌టి నుంచి కెసీఆర్ లో భ‌యం ప్రారంభం అయింద‌ని వ్యాఖ్యానించారు.

Next Story
Share it