Telugu Gateway
Politics

ఇలా రాజీనామా..అలా ఆమోదం

ఇలా రాజీనామా..అలా ఆమోదం
X

హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్ త‌న శాస‌న‌స‌భ్య‌త్వానికి చేసిన రాజీనామా జెట్ స్పీడ్ లో ఆమోదం పొందింది. ఆయ‌న అలా రాజీనామా చేశారు..వెంట‌నే ఇలా ఆమోదం అయిపోయింది. అంతే కాదు...ఈ రాజీనామాతో ఏర్ప‌డిన ఖాళీని వెంట‌నే నోటిపై చేసి కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి కూడా తెలియ‌జేశారు. శ‌నివారం ఉద‌యం మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ శాస‌న‌స‌భ‌లో కార్య‌ద‌ర్శికి త‌న రాజీనామా ప‌త్రాన్ని అంద‌జేసిన విష‌యం తెలిసిందే. వెంట‌నే స్పీక‌ర్ పోచారం శ్రీనివాస‌రెడ్డి దీన్ని ఆమోదించారు. రాజీనామా చేసిన అనంత‌రం ఈటెల రాజేంద‌ర్ ముఖ్య‌మంత్రి కెసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆయ‌న ఈ నెల 14న ఢిల్లీలో బిజెపిలో చేర‌నున్న విష‌యం తెలిసిందే.

ఈటెల‌తోపాటు మ‌రికొంత మంది నేత‌లు కూడా క‌మ‌లం గూటికి చేర‌నున్నారు. ఈటెల రాజీనామాతో ఏర్ప‌డిన ఖాళీతో తెలంగాణ‌లో మ‌రో ఉప ఎన్నిక అనివార్యం అయింది. అయితే గ‌త ఎన్నిక‌ల‌తో పోలిస్తే తెలంగాణ‌లో ఈ ఎన్నిక అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కం అవుతుంద‌నే విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్ప‌టికే అధికార టీఆర్ఎస్ కూడా ఉప ఎన్నిక‌పై ఫోక‌స్ పెట్టి త‌న వంతు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. ఈటెల కూడా త‌న గెలుపున‌కు అవ‌స‌ర‌మైన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. మ‌రి బిజెపి సాయం ఏ మేర‌కు ఉప‌యోగ‌ప‌డుతుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it