Telugu Gateway
Politics

జె పీ న‌డ్డాతో ఈటెల భేటీ

జె పీ న‌డ్డాతో ఈటెల భేటీ
X

మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ సోమ‌వారం నాడు ఢిల్లీలో బిజెపి ప్రెసిడెంట్ జె పీ న‌డ్డాతో స‌మావేశం అయ్యారు. ఈ బేటీ దాదాపు 45 నిమిషాల పాటు సాగింది. తెలంగాణ‌లో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై వీరిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ సాగింది. ఈటెల రాజేంద‌ర్ బిజెపిలో చేర‌టానికి ముహుర్తం నిర్ణ‌యించుకోవ‌టంతో పాటు పార్టీలో త‌న పాత్ర‌పై ఓ నిర్ణ‌యానికి రావ‌టం కోస‌మే ఈ భేటీ జ‌రిగిన‌ట్లు స‌మాచారం. ఈటెల రాజేంద‌ర్ తోపాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, తరుణ్‌ తుగ్‌, మాజీ ఎంపీ వివేక్‌, ఏనుగు రవీందర్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ స్థాపించిన తరువాత తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి కేసీఆర్‌ వెంట నడిచిన కొద్ది మందిలో ఈటెల రాజేంద‌ర్ ఒకరు. 2014లో తెలంగాణ సిద్ధించి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటైన తొలి కేబినెట్‌లో ఆర్థిక శాఖ మంత్రిగా కీలక మంత్రి పదవిని చేపట్టారు. 2018లో రెండోసారి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధినేత కెసీఆర్ తో పెరుగుతూ వచ్చిన దూరం చివరకు మంత్రి పదవి నుంచి తొలగించేంత వరకూ వెళ్లింది.

పార్టీతో ఆయనకున్న రెండు దశాబ్దాల అనుబంధం బీటలు వారింది. గ‌త కొంత కాలంగా ఈటెల రాజేంద‌ర్ టీఆర్ఎస్ స‌ర్కారు తీరుపై విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్నారు. ఈ త‌రుణంలో ఆయ‌న‌పై అక‌స్మాత్తుగా భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు రావ‌టం..సీఎం కెసీఆర్ వీటిపై విచార‌ణ‌కు ఆదేశించారు. ఆ త‌ర్వాత మంత్రివ‌ర్గం నుంచి తొల‌గించారు. దీంతో ఈటెల‌కు ప్ర‌త్యామ్నాయం చూసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయితే ఆయ‌న సొంత పార్టీ పెడ‌తార‌ని కొంత‌ కాలం ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఆయ‌న అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ బిజెపిలో చేర‌నుండ‌టం సంచ‌ల‌నంగా మారింది. కేవ‌లం స‌ర్కారు దాడి నుంచి త‌న‌ను తాను కాపాడుకునేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌నే విమ‌ర్శ‌ల‌ను ఈటెల రాజేంద‌ర్ ఎదుర్కొంటున్నారు. అయితే ఆయన త్వ‌ర‌లోనే త‌న నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లి స్థానిక నేత‌ల‌తో భేటీ అయిన త‌ర్వాత ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌టంతో పాటు బిజెపిలో చేరే ముహుర్తంపై నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

Next Story
Share it