Telugu Gateway
Politics

ఈటల ఏదో అనుకుంటే మరేదో అవుతోంది!

ఈటల ఏదో అనుకుంటే మరేదో అవుతోంది!
X

ఈటల రాజేందర్ ఏదో చేద్దాం అనుకుంటే అది ఏదో అవుతోంది. కొద్ది రోజుల క్రితం అయన మునుగోడు ఉపఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కి బిఆర్ఎస్ 25 కోట్ల రూపాయలు ఇచ్చింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి దుమారం రేపటంతో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తో పాటు మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన పాల్వాయి స్రవంతి కూడా తీవ్రంగా స్పందించారు. ఈటల రాజేందర్ ఆరోపణలను ఖండించారు. శనివారం నాడు రేవంత్ రెడ్డి ఏకంగా చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేశారు...ఈటల ఆరోపించినట్లు తాను కెసిఆర్ లేదా బిఆర్ఎస్ దగ్గర డబ్బులు తీసుకుంటే తాను , తన కుటుంబం సర్వనాశనం అయి పోతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులపై ఆరోపణలు, విమర్శలు సహజం అయినా రేవంత్ రెడ్డి గతం లో ఎన్నడూ లేని రీతిలో ఈ అంశంపై స్పందించారు. తన ఆరోపణలు నిజం అయితే ఈటల కూడా గుడికి వచ్చి ప్రమాణం చేయాలనీ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కానీ ఈటల రాలేదు. కానీ ఈ పరిణామాలపై స్పందిస్తూ అయన చేసిన కామెంట్స్ కొత్త దుమారం రేపటం ఖాయంగా కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో అంటే అటు భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణాల సవాళ్లు చేసింది ఎక్కువగా బీజేపీ తెలంగాణా ప్రెసిడెంట్ బండి సంజయ్ అనే చెప్పాలి. జీహెచ్ఎంసి ఎన్నికల సమయంలో బండి సంజయ్ వరద సాయం నిలిపివేయాలని ఈసి కి లేఖ రాసినట్లు బిఆర్ఎస్ ఆరోపించింది. దీనిపై అప్పట్లో బండి సంజయ్ తీవ్రంగా స్పందిస్తూ సీఎం కెసిఆర్ వస్తే తాను భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేస్తానంటూ అక్కడికి వెళ్లారు.

బిఆర్ఎస్ అసత్య ప్రచారాలు చేస్తోంది అంటూ మండిపడ్డారు. ఇటీవల ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పుడు కూడా యాదాద్రికి వెళ్లి బండి సంజయ్ ఎమ్మెల్యే ల కొనుగోలు అంశంలో బీజేపీ కి సంబంధం లేదు అని తడిబట్టలతో ప్రమాణం చేశారు .ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏది అయితే చేసారో అదే పని ఇంతకు ముందే పలు అంశాల్లో బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్ బండి సంజయ్ చేశారు. గుళ్లకు వెళ్ళటం, అమ్మ తోడు, అయ్యతోడు, పిల్లలతోడు అని ప్రమాణం చేయటం ఇదెక్కడి సంస్కృతి అంటూ ఈటల మాట్లాడారు. తనపై తనకు నమ్మకం లేకపోతే కదా అమ్మ తోడు..అయ్యతోడు అనాలి..రాజకీయ నాయకుడికి తాను చెప్పే మాటపై విశ్వాసం ఉండాలి అంటూ స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు గుళ్ళలో ప్రమాణాల సవాళ్లు ఎక్కువ చేసేది బండి సంజయ్. మరి ఆ సంగతి మర్చిపోయి ఈటల ఇలా ఎలా మాట్లాడారా అంటూ బీజేపీ నాయకులు అవాక్కు అవుతున్నారు. మిగిలిన విషయాల సంగతి ఎలా ఉన్న మునుగోడు ఎన్నిక విషయంలో కాంగ్రెస్ కు బిఆర్ ఎస్ 25 కోట్లు ఇచ్చింది అంటూ విమర్శలు చేయటం ద్వారా ఈటల కూడా తన విశ్వసనీయత కోల్పోయారు అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. గతంలో ఈటల ఏ విషయంలో అయినా ఆచితూచి స్పందించేవారు. కానీ ఇప్పుడు ఎక్కడో లెక్క తేడా కొడుతోంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రేవంత్ పై విమర్శలు చేసి చివరకు సొంత పార్టీ ప్రెసిడెంట్ చేసే పనులను ఈటల తప్పుపట్టినట్లు అయింది.

Next Story
Share it