Telugu Gateway
Politics

బీజేపీ చేరికల కమిటీకి ఈటల గుడ్ బై?!

బీజేపీ చేరికల కమిటీకి ఈటల గుడ్ బై?!
X

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకంపనలు తెలంగాణ రాజకీయాలపై కూడా పడుతున్నాయి. ఒక వైపు అధికార బిఆర్ఎస్ ఈ విషయంలో పైకి ఇది మాకు ఏమీ నష్టం చేయదు అని చెపుతున్నా లో లోపల మాత్రం వ్యూహాలు మార్చుకోక తప్పదు అనే నిర్ణయానికి వచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. అందుకే ఇప్పుడు సీఎం కెసిఆర్ ఆగమేఘాల మీద పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలతో మే 17 న సమావేశం అయి ఎన్నికల సన్నద్ధతపై చర్చించ నున్నారు. అధికార పార్టీ పరిస్థితి ఇలా ఉంటే వచ్చే ఎన్నికల్లో తెలంగాణ లో ఎలాగైనా అధికారంలోకి వస్తామని చెపుతూ వస్తున్నా బీజేపీ కి కర్ణాటక ఫలితాలు పెద్ద షాక్ గా మారాయి. దీంతో ఆ పార్టీ నాయకులూ అంతర్మధనం చెందుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తనను చేరికల కమిటీ బాధ్యతల నుంచి తప్పించాలని కోరుతున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై అయన ఢిల్లీ కి చేరుకున్నట్లు చెపుతున్నారు. వాస్తవానికి కొద్ది రోజుల క్రితం ఈటలకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారు అని ప్రచారం జరిగింది. కానీ అదేమీ వాస్తవరూపం దాల్చలేదు.

ప్రస్తుత ప్రెసిడెంట్ బండి సంజయ్ తో అత్యంత కీలకమైన ఈ ఎన్నికల్లో బీజేపీ బండి ఏ మేరకు ముందుకు సాగుతుంది అన్న దానిపై బీజేపీ నేతల్లోనే పలు అనుమానాలు ఉన్నాయి. కీలక నేతల మధ్య ఏ మాత్రం సఖ్యత లేదు అని...కర్ణాటక ఫలితాల తర్వాత ఇప్పుడు తెలంగాణ బీజేపీ లో ఎలాంటి కొత్త చేరికలు కూడా ఉండవని చెపుతున్నారు. అంతే కాదు పలువురు కీలక నాయకులు ఇప్పటికే పక్క చూపులు చూస్తున్నారు అని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారాలు అన్నీ తెలంగాణ బీజేపీ లో గందరగోళాన్ని సూచిస్తున్నాయి అని ఒక కీలకనేత వ్యాఖ్యానించారు. కర్ణాటకలో అధికారంలో ఉండి...ప్రధాని మోడీ పెద్ద ఎత్తున ప్రచారం చేయటంతో పాటు ఎన్ని రోడ్ షో లు చేసినా ఫలితంలో ఏ మాత్రం మార్పు లేదు. కారణాలు ఏమైనా తెలంగాణలో బీజేపీ పై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. మరి ఈ పరిస్థితుల్లో బీజేపీ రాజకీయంగా తెలంగాణాలో నిలదొక్కుకోవడం అంటే ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు అని ఆ పార్టీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి వేచిచూడాల్సిందే.

Next Story
Share it