Telugu Gateway
Politics

దుబ్బాక రిజల్ట్ వన్ టైమ్ వండర్

దుబ్బాక రిజల్ట్ వన్ టైమ్ వండర్
X

తెలంగాణలో దూకుడు చూపిస్తున్న బిజెపిపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక రిజల్ట్ వన్ టైమ్ వండర్ మాత్రమే అన్నారు. ఇలాంటి వన్ టైమ్ వండర్లు గతంలో కూడా చాలాసార్లు జరిగాయని ఎధ్దేవా చేశారు. ఒక్క సీటు గెలవగానే తెలంగాణలో బిజెపి ప్రత్యామ్నాయం అవుతుందా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సోమవారం నాడు గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. దుబ్బాకలో రఘునందన్ రావు ఎలా గెలిచారో కారణాలేంటో మరోసారి చెబుతానన్నారు. కర్ణుడి చావుకు వంద కారణాలు ఉన్నట్లు రఘునందన్ గెలుపుకు సవాలక్ష కారణాలు ఉన్నాయని తెలిపారు. టీఆర్ఎస్ లో రఘునందన్ కు ఎవరు సహకరించారు. నగదు ఇచ్చిన వారు ఎవరు..నగదు బదిలీ చేసినోడు ఎవరు..ఓట్లు బదిలీ చేసినోడు ఎవరు? నోట్లు బదిలీ చేసినోడు ఎవరు అసలు ఈ వ్యవహారం అంతా ఏంది?. ఇవాళ తెలంగాణ సమాజం అంతా కులం గెలిసింది కానీ..ప్రజలు గెలవలేదని ఎందుకు అనుకుంటున్నారు తర్వాత చెబుతానన్నారు. గురువు గారి అశీర్వాదం ఉందని తిరుపతిలో గుండు కొట్టించుకోగానే ఏమి చెప్పాడో ..గురువు సంతోషిస్తున్నాడు అని చెప్పాడని వ్యాఖ్యానించారు.

టీఆర్ఎస్, బిజెపి పార్టీల నాటకాలు, బూటకాలను తెలంగాణ సమాజం గమనిస్తోందని అన్నారు. దుబ్బాకలో గెలవగానే టీఆర్ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నామయని ఆ పార్టీ నాయకులు ప్రకటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 2012లో మహబూబ్‌నగర్‌లో ఉప ఎన్నికలు వచ్చాయని, తెలంగాణ ఉద్యమం పరాకాష్టలో ఉందని, అప్పుడు బీజేపీ నుంచి శ్రీనివాస రెడ్డి గెలిచారని రేవంత్ రెడ్డి అన్నారు. అప్పుడు కూడా మొత్తం తుపాన్ వచ్చేసిందని, బీజేపీకి ఎదురేలేదని అన్నారని, చివరికి ఏమైందని ప్రశ్నించారు. 2014 నుంచి 2018 వరకు బీజేపీకి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని అన్నారు. 2018 ఎన్నికల్లో 105 మందికి డిపాజిట్లు పోయాయని, ఒక్క ఎమ్మెల్యే గెలిచారన్నారు. 2019లో నాలుగు ఎంపీ స్థానాలు గెలిచారని, ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ నుంచి నామినేషన్లు వేయడానికి అభ్యర్థులే లేరని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే ఏమీ చేయలేని వారు ఇప్పుడు ఇద్దరితో చేస్తారా? అని ప్రశ్నించారు.

Next Story
Share it