Telugu Gateway
Politics

కెసిఆర్ కు అటూ...ఇటూ

కెసిఆర్ కు అటూ...ఇటూ
X

బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు డబల్ టెన్షన్ తప్పేలా లేదు. ఇప్పుడు అయన అటూ..ఇటూ రెండు చోట్లా ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి. ఎక్కడ లెక్క తేడా వచ్చిన ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది అనే భయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కామారెడ్డి బరిలో కూడా దిగబోతున్నారు. అంటే టార్గెట్ కెసిఆర్ గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరింత రంజుగా మారబోతున్నాయి. ఎవరు గెలుస్తారు...ఎవరు ఓడుతారు అనేది డిసెంబర్ 3 న తేలుతుంది కానీ...అప్పటి వరకు అటు గజ్వేల్, ఇటు కామారెడ్డి ఎన్నికలు మాత్రం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారబోతున్నాయి అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే గజ్వేల్ లో సీఎం కెసిఆర్ పై సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ తరపున బరిలో దిగుతున్న విషయం తెలిసిందే. దీంతో గజ్వేల్ ఎన్నిక కూడా అందరిలో ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ తరపున గజ్వేల్ బరిలో తూముకుంట నర్సింహా రెడ్డి పోటీలో ఉన్నా రేస్ ప్రధానంగా సీఎం కెసిఆర్ , ఈటల రాజేందర్ మద్యే ఉంటుంది అనే అంచనాలు ఉన్నాయి. బిఆర్ఎస్ అధినేత, సీఎం కెసిఆర్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తారనే అంశమే రాజకీయంగా రకరకాల చర్చలకు కారణం అయింది . అధికార బిఆర్ఎస్ చెప్పే నియోజకవర్గ అభివృద్ధి వంటి అంశాలను ప్రజలు పెద్దగా ఎవరూ నమ్మటం లేదు అనే చెప్పొచ్చు. గత కొంత కాలంగా కామారెడ్డి నుంచి సీఎం కెసిఆర్ పై రేవంత్ రెడ్డి పోటీకి దిగుతారు అని ప్రచారం ఉన్నా కూడా ఈ అంశంపై శనివారం నాడే అధికారికంగా స్పష్టత వచ్చింది.

అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అటు కొడంగల్, ఇటు కామారెడ్డి బరిలో ఉండబోతున్నారు. వాస్తవానికి కామారెడ్డి మాజీ మంత్రి షబ్బీర్ అలీ సీటు. రేవంత్ పోటీకి వీలుగా ఆయనకు ప్రత్యామ్నాయంగా మరో సీటు కేటాయించ బోతున్నారు. షబ్బీర్ అలీ కి నిజామాబాద్ అర్బన్ సీటు కేటాయించినట్లు సమాచారం. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు కామారెడ్డి లో రేవంత్ రెడ్డి నవంబర్ 8 న నామినేషన్ వేయబోతున్నారు. నామినేషన్ల తోలి రోజు అంటే నవంబర్ 3 నే రేవంత్ రెడ్డి తరపున కొడంగల్ లో నామినేషన్ దాఖలు అయింది. రేవంత్ స్వయంగా నవంబర్ ఆరు న మరో సెట్ నామినేషన్స్ వేయబోతున్నారు. సీఎం కెసిఆర్ పై అటు ఈటల రాజేందర్, ఇటు రేవంత్ రెడ్డి బరిలోకి దిగటం వల్ల బిఆర్ఎస్ ఈ నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెపుతున్నారు. అదే సమయంలో కెసిఆర్ గతంలో చేసినట్లు మిగిలిన అంశాలపై అంత ఫోకస్ పెట్టడం ఒకింత కష్టం అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బిఆర్ఎస్ తొమ్మిదిన్నర సంవత్సరాలుగా అధికారంలో ఉండటం వల్ల వివిధ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. మరో వైపు తాజాగా వెలుగులోకి వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్ట్ వైఫల్యాలు బిఆర్ ఎస్ ను ఎన్నికల్లో ముంచు తాయనే భయం ఆ పార్టీ నేతల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై ఫోకల్ పెంచి టార్గెట్ కెసిఆర్ గా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది.

Next Story
Share it