వైట్ హౌస్ వీడిన ట్రంప్
అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్న కొద్ది గంటల ముందు డొనాల్డ్ ట్రంప్ దంపతులు వైట్ హౌస్ ను వీడారు. వైట్‌హౌజ్ సిబ్బంది ట్రంప్ దంపతులకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ''ఈ నాలుగేళ్లు ఎంతో గొప్పగా గడిచాయి. మనమంతా కలిసి ఎన్నో సాధించాం. నా కుటుంబం, స్నేహితులు, నా సిబ్బందికి పేరు పేరునా ధన్యవాదాలు. మీరెంత కఠినశ్రమకోర్చారో ప్రజలకు తెలియదు. అధ్యక్షుడిగా పనిచేయడం నా జీవితకాలంలో లభించిన గొప్ప గౌరవం.' అని వ్యాఖ్యానించారు. ''మనది గొప్ప దేశం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తి. కరోనా మహమ్మారి మనల్ని దారుణంగా దెబ్బకొట్టింది.
అయినా మనమంతా కలిసి వైద్యపరంగా ఒక అద్భుతమే చేశాం. తొమ్మిది నెలల్లో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసుకున్నాం'' అని ప్రకటించారు. నూతన పాలనా యంత్రాంగానికి ఆల్ ద బెస్ట్ చెప్పిన ట్రంప్.. ''మీకోసం(ప్రజలు) ఎల్లప్పుడూ నేను పాటుపడతాను. ఈ దేశ భవిష్యత్తు గొప్పగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా. కొత్త ప్రభుత్వం మరింత సమర్థవంతంగా పనిచేయాలి'' అని ప్రకటించారు. వైట్ హౌస్ నుంచి బయలుదేరి ట్రంప్ దంపతులు ఫ్లోరిడాలోని పామ్ బీచ్ సమీపంలో ఉన్న మారో లాగో రిసార్ట్ కు వెళ్ళనున్నారు. తన పదవి కాలం చివరి రోజున పలువురి క్షమాబిక్ష పెట్టడంతోపాటు..పలువురి శిక్షలు కూడా కుదించారు.