Telugu Gateway
Politics

ఫైజర్ వ్యాక్సిన్ పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఫైజర్ వ్యాక్సిన్ పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
X

దిగ్గజ ఫార్మా సంస్థ ఫైజర్ వ్యాక్సిన్ పై కీలక ప్రకటన చేసి ప్రపంచానికి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ఇప్పటివరకూ ఇంత స్పష్టమైన ప్రకటన వచ్చింది కూడా ఈ కంపెనీ నుంచే కావటం గమనార్హం. త్వరలోనే వ్యాక్సిన్లకు సంబంధించి మరిన్ని ప్రకటనలు రావటం ఖాయంగా కన్పిస్తోంది. ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫైజర్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందనే విషయాన్నిఇప్పటిదాకా కావాలనే దాచిపెట్టారని ట్రంప్ ఆరోపించారు. ఫైజర్ తోపాటు అమెరికాకు చెందిన ఆహార, ఔషధ నియంత్రణా సంస్థ(ఎఫ్ డీఏ) కుమ్మక్కు అయ్యాయనే తరహాలో ఆయన స్పందించారు. ముందే ఈ విషయం ప్రకటిస్తే రాజకీయం గా ఎన్నికల్లో తనకు లబ్ది కలుగుతుందనే ఇలా చేశారన్నారు. జో బైడెన్ అధ్యక్షుడు అయి ఉంటే వ్యాక్సిన్ ఎప్పటికీ వచ్చి ఉండేదికాదని వ్యాఖ్యానించారు.

ఈ కారణంగా లక్షలాది మంది ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడేదన్నారు. రాజకీయాల కోసం కాకపోయినా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అయినా ఈ విషయాన్ని ముందే ప్రకటించి ఉండాల్సిందన్నారు. అమెరికాకు చెందిన ఫైజర్, బయో ఎన్ టెక్ సంస్థలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ 90 శాతం సమర్ధతతో పనిచేస్తున్నట్లు మూడవ దశ ప్రాథమిక ఫలితాల్లో తేలిందని సోమవారం నాడు ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ మరోసారి మీడియాపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా మీడియాను దూరం పెట్టాలన్నారు. మీడియా ప్రజలను తప్పుదోవ పట్టించిందని..అదే సమయంలో నిధుల సేకరణపై ప్రభావం పడిందన్నారు. కుట్రలో భాగంగానే పలు మీడియా సంస్థలు అంచనాల పేరిట తనకు తక్కువ సీట్లు వస్తున్నట్లు చూపించారని ఆరోపించారు.

Next Story
Share it