Telugu Gateway
Politics

రైతుల సమస్యలు వదిలి అసెంబ్లీలో బూతులు తిట్టుకుంటారా?

రైతుల సమస్యలు వదిలి అసెంబ్లీలో బూతులు తిట్టుకుంటారా?
X

రైతులకు ఎకరాకు 25 వేలు ఇవ్వాలి, పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం నాడు నివర్ తుఫాన్ బాధిత రైతులను పరామర్శించారు. కౌలు రైతులను ఆదుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని పవన్ కల్యాణ్ గారు స్పష్టం చేశారు. ప్రభుత్వం దీని కోసం ఓ ప్రత్యేక కార్యచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. గ్రామ సచివాలయం ఉద్యోగుల సహాయంతో కౌలు రైతులను గుర్తించి, వారికి మిగిలిన రైతులతో పాటు పరిహారం అందచేయాలని సూచించారు. ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలన్నారు. నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా కృష్ణా జిల్లా మోపిదేవిలో పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. " కంకిపాడు నుంచి ఉయ్యూరు, పామర్రు, చల్లపల్లి మీదుగా అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని మోపిదేవి మండలాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించడం జరిగింది.

కరోనా సమయంలో కూడా రైతులు ప్రాణాలను పణంగా పెట్టి పండిస్తే.. తుపాన్ దెబ్బకి ప్రభుత్వ లెక్కల ప్రకారం 17 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇలాంటి సమయంలో వారి బాధలు కచ్చితంగా బయటికి తెలియాలి. కంకిపాడులో వెయ్యి ఎకరాల ఆయకట్టులో 1600 మంది రైతులు ఉంటే అందులో వెయ్యి మంది కౌలు రైతులే ఉన్నారు. ఇలా పంటకు నష్టం వాటిల్లడం ఏడాదిలో ఇది మూడోసారి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా మొత్తం రెండున్నర లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లగా, అందులో అత్యధిక శాతం అవనిగడ్డ నియోజకవర్గంలోనే ఉంది. నష్టపోయిన రైతుల్లో 60 శాతం కౌలు రైతులే ఉన్నారు. ఇలాంటి సమయంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి పంపితే వారు అసెంబ్లీలో కూర్చుని బూతులు తిట్టుకుంటున్నారు.

కనీసం రైతులను ఎలా ఆదుకోవాలి అన్న చర్చ కూడా చేయడం లేదు. ముందు ఆ విషయంపై చర్చించండి. హైదరాబాద్ లో వరదలు వస్తే తెలంగాణ ప్రభుత్వం తక్షణ సాయం కింది ఇంటికి రూ. 10 వేలు ఇచ్చింది. మొత్తం రూ. 650 కోట్లు విడుదల చేసింది. నివర్ తుపాను కారణంగా నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ. 25 వేల నుంచి రూ. 30 వేలు పరిహారం చెల్లించాలి. తక్షణ సాయం కింద ఎకరాకి రూ. 10 వేలు ఇవ్వాలి. మొన్న చల్లపల్లి మండలంలో అప్పుల బాధ తాళలేక ఒక దళిత రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ రోజు అవనిగడ్డ మండలంలో ఒక మరో కౌలు రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం ప్రభుత్వం ప్రకటించాలి.' అని డిమాండ్ చేశారు.

Next Story
Share it