Telugu Gateway
Politics

కాంగ్రెస్ లోకి ధ‌ర్మ‌పురి సంజ‌య్..ఎర్ర శేఖ‌ర్

కాంగ్రెస్ లోకి ధ‌ర్మ‌పురి సంజ‌య్..ఎర్ర శేఖ‌ర్
X

తెలంగాణలో పార్టీల మార్పు వ్య‌వ‌హారం ఊపందుకుంది. టీపీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి నియామ‌కం కావ‌టం ఒక‌టి అయితే బిజెపి కూడా దూకుడు పెంచుతోంది. దీంతో ఎవరికి వారు త‌మ‌కు అనుకూలంగా ఉండే పార్టీల‌వైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్ప‌టికే టీ టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్న ఎల్ ర‌మ‌ణ ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరిన విష‌యం తెలిసిందే. మంగ‌ళ‌వారం నాడు ప‌లువురు నేత‌లు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో స‌మావేశం అయ్యారు. వారు ఆ పార్టీలో చేర‌టానికి రెడీ అయ్యారు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని బలపర్చడానికే తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తున్నానని మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ తెలిపారు. మంచి రోజు చూసుకొని పార్టీలో చేరతానన్నారు. తన తండ్రి డీఎస్ కోసం టీఆర్ఎస్ కండువా కప్పుకున్నానని చెప్పారు. కానీ అది కండువా కాదు.. గొడ్డలి అని తనకు తెలుసని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌తో పోలిస్తే.. టీఆర్ఎస్ పార్టీయే కాదన్నారు. కడుపులో కోపం ఉన్నా.. ఒక్క మాట కూడా మాట్లాడలేదని, తన తమ్ముడు ఏ పార్టీలో ఉంటే.. తనకేంటి అన్నారు. రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ రాజీనామా చేశారు. త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నట్టు తెలిపారు. బీజేపీని వీడడానికి అనేక కారణాలున్నాయన్నారు. వాటి వివరాలు చెబుతా అన్నారు. మరో బీజేపీ నాయకుడు గండ్ర సత్యనారాయణ రావు కూడా ఆ పార్టీని వీడనున్నారు. రేవంత్‌తో కలిసి టీడీపీలో పనిచేశానని, మంచిరోజు చూసి కాంగ్రెస్‌లో చేరతానన్నారు.

Next Story
Share it