ఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి

మహారాష్ట్ర కీలక నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు బిజెపి అధిష్టానం ఝలక్ ఇచ్చింది. ఏక్ నాథ్ షిండే సీఎంగా ఉండే ప్రభుత్వంలో తాము భాగస్వాములం కాబోవటం లేదు..కానీ తాము ఈ ప్రభుత్వానికి పూర్తి అండదండలు అందిస్తామని ఫడ్నవీస్ చెప్పిన కొన్ని గంటల్లోనే ఆయన్ను డిప్యూటీ సీఎం పదవి తీసుకోవాలని అధిష్టానం ఆదేశించింది. బిజెపి జాతీయ ప్రెసిడెంట్ నడ్డాతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా దీనిపై ప్రకటన చేయటంతో అందరూ అవాక్కు అయ్యారు.
అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నా..సీఎం సీటు ఇవ్వకపోయినా పెద్దగా ఒత్తిడి చేయలేని స్థితిలో ఉన్న ఏక్ నాథ్ షిండేకు సీఎం పదవి అప్పగించి..ఫడ్నవీస్ కు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోమనటం మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ గా మారింది. ఫడ్నవీస్ గవర్నర్ తో భేటీ అనంతరం చెప్పిన దానికి పూర్తి భిన్నంగా అమిత్ షా, నడ్డాలు ప్రకటన చేయటం చర్చనీయాంశంగా మారింది. అధిష్టానంతో అసలు ఫడ్నవీస్ ఏమి చర్చించారు. వాళ్లు చెప్పిన దానికి భిన్నంగా ఫడ్నవీస్ వ్యవహరించారా? లేక అధిష్టానమే మనసు మార్చుకుందా అన్నది ఆసక్తికరంగా మారింది.