Telugu Gateway
Politics

కేజ్రీవాల్ సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌కు బ్రేక్..మోడీకి లేఖ‌

కేజ్రీవాల్ సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌కు బ్రేక్..మోడీకి లేఖ‌
X

ఓ ముఖ్య‌మంత్రి విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ళాల‌నుకుంటే స‌హ‌జంగానే దీనికి కేంద్రం ఆమోదం తెలుపుతుంది. ఏ రాష్ట్ర సీఎం విష‌యంలో అయినా అలానే జరుగుతుంది. కానీ ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ కు మాత్రం చేదు అనుభ‌వం ఎదురైంది. ఆయ‌న‌కు సింగ‌పూర్ ప్ర‌భుత్వం నుంచి అధికారికంగా ఆహ్వానం అందింది. అక్క‌డ ఆయ‌న ప్ర‌పంచ నాయ‌కుల ముందు ఢిల్లీ మోడ‌ల్ పాల‌న గురించి ప్ర‌జంటేష‌న్ ఇవ్వాల్సి ఉంది. తన సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తి ఇవ్వాల్సిందిగా కోరుతూ అర‌వింద్ కేజ్రీవాల్ జూన్ 7న లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కు ప్ర‌తిపాద‌న‌లు పంపారు.

ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న దీనికి ఆమోదం తెల‌ప‌లేదు. సింగ‌పూర్ వెళ్ల‌కుండా త‌న‌ను అడ్డుకుంటున్నార‌ని..ఇది ఏ మాత్రం స‌హేతుకం కాదంటూ కేజ్రీవాల్ తాజాగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి లేఖ రాశారు. సింగ‌పూర్ స‌మావేశంలో ప్రాతినిధ్యం వ‌హించ‌టం, ప్ర‌పంచ వేదిక‌పై ఢిల్లీ గురించి చెప్ప‌టం భార‌త్ కు గ‌ర్వ‌కార‌ణం అని..త‌న‌కు అనుమ‌తి ఇప్పించాల‌ని కోరుతూ ఆయ‌న లేఖ రాశారు. వ‌ర‌ల్డ్ సిటీస్ స‌మ్మిట్ కు ఆయ‌న హాజ‌రు కావాల్సి ఉంది. మ‌రి ప్ర‌ధాని మోడీ ఈ విష‌యంలో జోక్యం చేసుకుంటారా లేదా అన్న‌ది వేచిచూడాల్సిందే.

Next Story
Share it