హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయపై దాడి
హిమాచల్ ప్రదేశ్ లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. గవర్నర్ బండారు దత్తాత్రేయపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాడి చేశారు. ఈ వ్యవహారం కలకలం రేపింది. గవర్నర్ దత్తాత్రేయ బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగం చేసి బయటకు వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేష్ భరద్వాజ్ మాట్లాడుతూ.. గవర్నర్ తన వాహనం వద్దకు వెళుతున్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనపై దాడి చేశారని తెలిపారు. గవర్నర్ పై దాడికి పాల్పడిన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. వీరిలో ప్రతిపక్ష నాయకుడు ముఖేష్ అగ్నిహోత్రి, ఎమ్మెల్యేలు హర్ష్ వర్ధన్ చౌహాన్, సుందర్ సింగ్ ఠాకూర్, సత్పాల్ రైజాదా, వినయ్ కుమార్ ఉన్నారు. వీరిని సభ నుంచి సస్పెండ్ చేశారు.
గవర్నర్ దత్తాత్రేయ ప్రసంగం చేస్తుండగా.. ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో గవర్నర్ తన ప్రసంగంలోని చివరి లైన్లను మాత్రమే చదివి, ప్రసంగం మొత్తం చదివినట్లుగా భావించాలని పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగంపై కాంగ్రెస్ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెల్లడించిన విషయాలన్నీ అబద్ధాలని ఆరోపించారు. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల సమస్యనీ ప్రసంగంలో చేర్చలేదన్నారు. స్పీచ్ ముగించిన అనంతర దత్తాత్రేయ తన కారు దగ్గరకు వెళ్తుండగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో కాంగ్రెస్ సభ్యుల ప్రవర్తనను ఖండించారు. ఇక గవర్నర్‌పై దాడి చేసిన ఎమ్మెల్యేలను మార్చి 20 వరకు సస్పెండ్ చేశారు.