Telugu Gateway
Politics

న్యాయవాదుల హత్యపై శ్రీధర్ బాబు ఆగ్రహం

న్యాయవాదుల హత్యపై శ్రీధర్ బాబు ఆగ్రహం
X

మంథని నియోజకవర్గంలో గత కొంత కాలంగా రౌడీలు రాజ్యమేలుతున్నారని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసులు వారికి సహకరిస్తున్నారని ధ్వజమెత్తారు. పట్టపగలు న్యాయవాదుల హత్య దారుణమని...ఈ హత్య జరిగిన ప్రదేశంలో కూడా ఆధారాలు లేకుండ చేసే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఈ ఘటనకు డీజీపీ, సీపీలే బాధ్యత వహించాలన్నారు. న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణిలది మమ్మూటికి పోలీసులు చేయించిన హత్యేనని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మండిపడ్డారు. పట్టపగలు మహిళా న్యాయవాదిని చంపిన తర్వాత పోలీస్ యూనిఫాం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా పోలీసులు ఇచ్చిన బహుమతి ఇదా అని శ్రీధర్‌బాబు విమర్శించారు.

శాంతి భద్రతలు కాపాడమంటే చంపిన వాళ్లకు రక్షణ ఇస్తారా అని పోలీసులపై శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. తమకు ప్రాణహాని ఉందని న్యాయవాద దంపతులు ఎన్నో రోజులుగా చెబుతున్నా పోలీసులు పట్టించుకోలేదని శ్రీధర్‌బాబు ఆరోపించారు. వామనరావు, నాగమణిని కారులోనే విచక్షణారహితంగా కత్తులతో దుండగులు నరికిచంపారు. రామగిరి మండలం కలవచర్ల వద్ద బుధవారం మధ్యాహ్నాం ఈ ఘటన జరిగింది. న్యాయవాది దంపతుల స్వగ్రామం మంథని మండలం గుంజపడుగు. కుంట శ్రీను తమపై దాడి చేయించి ఉంటాడంటూ చనిపోయే ముందు వామనరావు చెప్పినట్లు వార్తలు వెలువడ్డాయి. రాష్ట్రంలోని విచారణ సంస్థలపై తమకు నమ్మకం లేదని..సీబీఐతో విచారణ జరిపించాలి డిమాండ్ చేశారు.

Next Story
Share it