రాహుల్ తో భేటీ..మారిపోయిన జగ్గారెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పూర్తిగా మారిపోయారు. రాహుల్ గాందీతో భేటీ అనంతరం అన్నీ మర్చిపోయానంటున్నారు ఆయన. ఇక తాను ఎలాంటి అంశాలు మాట్లాడనని..తమ పోరాటం బిజెపి, టీఆర్ఎస్, ఎంఐఎంతోనే అన్నారు. తమ కోసం రాహుల్ గాంధీ మూడు గంటల సమయం కేటాయించి అందరం కుటుంబంలా కలసి పనిచేయాలని చెప్పిన తర్వాత అందుకు భిన్నంగా వ్యవహరిస్తే తనను తాను అవమానించుకున్నట్లే అని వ్యాఖ్యానించారు. జగ్గారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలసి బుధవారం నాడు రాహుల్ గాంధీని ఆయన నివాసంలో కలిశారు. అందరితో కలసి ఫోటో దిగారు. కేవలం ఫోటో దిగటం కోసమే ఇక్కడకు వచ్చానని..రాహుల్ కుటుంబానికి ఎంతో చరిత్ర ఉందని ప్రశంసించారు.
కాంగ్రెస్ నేతలు ఎవరైనా సరే ఇలా కుటుంబంతో కలసి ఇలా రాహుల్ తో కలసి ఫోటో దిగాలని కోరుకుంటారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారమే లక్ష్యంగా పనిచేయాలన్నారని, పార్టీలో అంతా ఐకమత్యంగా ఉండాలని రాహుల్ చెప్పారని పేర్కొన్నారు. ఇక నుంచి రాహుల్ గైడ్‌లైన్స్ ప్రకారం ముందుకెళ్తామని జగ్గారెడ్డి ప్రకటించారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీరుపై అసమ్మతి గళం విన్పిస్తున్న నాయకులు అందరూ రాహుల్ తో భేటీ అనంతరం మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. అయితే ఇది ఎంత కాలం ఉంటుంది అన్నది వేచిచూడాల్సిందే.