Telugu Gateway
Politics

'దిద్దుబాట‌'లో కాంగ్రెస్

దిద్దుబాట‌లో కాంగ్రెస్
X

కాంగ్రెస్ దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగింది. అస‌మ్మ‌తి నేత‌ల‌ను కూడా బుజ్జ‌గిస్తోంది. గ‌తంలో జ‌రిగిన త‌ప్పులు తిరిగి జ‌ర‌క్కుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై సీనియ‌ర్ల స‌ల‌హాలు తీసుకుంటోంది. ఈ త‌రుణంలో అస‌మ్మ‌తి టీమ్ లో కీల‌కంగా ఉన్న సీనియ‌ర్ నేత గులాం న‌బీ ఆజాద్ శుక్ర‌వారం నాడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియాగాంధీతో స‌మావేశం అయ్యారు. ముఖ్యంగా ఇటీవ‌ల జ‌రిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర‌ప‌రాజ‌యం పాల‌వటంతో అధిష్టానంపై సీనియ‌ర్లు మండిప‌డ్డారు. ఫ్యామిలీ కాంగ్రెస్ కాకుండా..అంద‌రి కాంగ్రెస్ కావాల‌ని కొంత మంది నేత‌లు బ‌హిరంగంగా డిమాండ్ చేశారు. కొంత మంది సీనియ‌ర్లు గాంధీ కుటుంబం పూర్తిగా ప‌క్కకు త‌ప్పుకుని..కొత్త వారికి ప్రెసిడెంట్ బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని డిమాండ్ చేశారు. మ‌రికొంత మంది మాత్రం సోనియా, రాహుల్ గాంధీల‌పై పూర్తి విశ్వాసం ప్ర‌ద‌ర్శించారు. గులాం నబీ ఆజాద్ గంటకు పైగా సోనియాతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.

పార్టీలో నాయకత్వ మార్పు అంశంపై జీ23 సభ్యులేమనుకుంటున్నారో కూడా ఆజాద్ ఆమెకు వివరించారు. పార్టీని మరింత పటిష్టం చేసేందుకు సలహాలు ఇచ్చానని ఆజాద్ ఈ భేటీ అనంత‌రం వెల్లడించారు. 2024 ఎన్నికలకు సంసిద్ధం కావాలని సమావేశంలో నిర్ణయించామని ఆజాద్ తెలిపారు. ప్రస్తుతానికి పార్టీకి అధ్యక్షురాలిగా సోనియా కొనసాగుతారని ఆజాద్ స్పష్టం చేశారు.ఫ్యామిలీ కాంగ్రెస్ కాకుండా అందరి కాంగ్రెస్ కావాలని సీనియర్ నేత కపిల్ సిబల్ వ్యాఖ్యానించినప్పటినుంచీ పార్టీలో దుమారం రేపింది. ఇటీవలి ఎన్నికల ఫలితాల్లో ఓటమి బాధ్యత ఎవరు తీసుకుంటారని పార్టీ సీనియర్ మనీశ్ తివారి ప్రశ్నించడం పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. అస‌లు రాహుల్ గాంధీ ఏ హోదాలో నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని కొంత మంది నేత‌లు ప్ర‌శ్నించారు. హ‌ర్యానా మాజీ సీఎం భూపేంద‌ర్ సింగ్ హుడాతో గురువారం నాడు రాహుల్ గాంధీ సుదీర్ఘ భేటీ జ‌రిపారు. అందులోనూ ఆయ‌న పార్టీలో చేయాల్సిన మార్పుల‌పై స‌ల‌హాలు, సూచ‌న‌లు చేశారు.

Next Story
Share it