Telugu Gateway
Politics

రైలు టిక్కెట్ల కొనుగోలుకు డబ్బులు లేవు !

రైలు టిక్కెట్ల కొనుగోలుకు డబ్బులు లేవు !
X

లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఇప్పటికే కేంద్రంలో రెండు సార్లు అధికారానికి దూరంగా ఉన్న ఆ పార్టీ ఈ సారి ఇండియా కూటమితో బరిలో నిలిచి అధికారంలోకి రావాలనే ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తో పాటు...న్యాయ యాత్ర కూడా నిర్వహించారు. ఇప్పుడు కాంగ్రెస్ ఆశలు అన్నీ రాహుల్ గాంధీ పైనే. అత్యంత కీలక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిధుల సమస్యను ఎదుర్కొంటోంది. అందుకే ఎన్నికల వేళ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తో పాటు ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ లు గురువారం నాడు మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పరిస్థితి వివరించారు. అదే సమయంలో ప్రధాని మోడీపై, బీజేపీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ కి చెందిన అన్ని ఖాతాలను ఐటి శాఖ సీజ్ చేయటంతో ఇప్పుడు తమ పార్టీ నాయకులకు విమాన టికెట్స్ కాదు కదా...రైల్వే టికెట్స్ కొనటానికి కూడా తమ దగ్గర డబ్బులు లేవు అని రాహుల్ గాంధీ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ని దెబ్బతీయడానికి మోడీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో డబ్బు లేకపోవటంతో తాము ప్రచారం చేయలేకపోతున్నాం అని...ప్రకటనల విడుదలకు కూడా నిధులు సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. వ్యక్తులు అయినా...పార్టీలకు అయినా బ్యాంకు ఖాతాలను నిలిపివేస్తే ఎలా ఉంటుందో అందరికి తెలుసన్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా లు కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని తెలిపారు.

ఇది కాంగ్రెస్ పార్టీ ఖాతాలను నిలిపివేయటం కాదు అని...భారత ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోవటమే అంటూ రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది అని ఆరోపించారు. ఎన్నికల్లో పోరాడకుండా తమకు అడ్డంకులు కలిపిస్తున్నారు అని..దీనిపై ఈసీ కి ఫిర్యాదు చేసినా కూడా ఉపయోగం లేకుండా పోయింది అని వెల్లడించారు. ఒక వైపు తమ డబ్బును బలవంతంగా తీసుకుంటూ..మరో వైపు బీజేపీ ఎన్నికల బాండ్ల రూపంలో ఎంత మొత్తం పొందిందో అందరూ చూస్తున్నారు అని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. లోక్ సభ ఎన్నికలు సజావుగా సాగాలంటే తమ ఖాతాలపై విధించిన ఆంక్షలు ఎత్తేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. టైం చూసి కాంగ్రెస్ ను దెబ్బకొట్టాలని చూస్తున్నారు అని ..అభ్యర్థులకు ఇవ్వటానికి కూడా తమ దగ్గర డబ్బు లేదు అన్నారు. ఎన్నికల బాండ్స్ ద్వారా దేశంలో అత్యధిక లబ్ది ఎవరు పొందారో దేశ ప్రజలు అందరూ చూశారు అని..ఇది చాలా తీవ్రమైన అంశం అని అజయ్ మాకెన్ పేర్కొన్నారు. మరి కాంగ్రెస్ అగ్రనేతల డిమాండ్స్ ను అటు బీజేపీ సర్కారు...ఈసి పట్టించుకుంటాయో లేదో చూడాల్సిందే. 1994 -95 సంవత్సరాలకు సంబంధించి ఇప్పుడు ఐటి శాఖ నోటీసులు ఇచ్చి ఖాతాలను ఫ్రీజ్ చేసింది అని తెలిపారు. కాంగ్రెస్ విమర్శలను బీజేపీ తిప్పికోట్టింది. కాంగ్రెస్ ఖాతాల నిలిపివేతపై బీజేపీ కి ఏ మాత్రం సంబంధం లేదు అని ఆ పార్టీ కౌంటర్ ఇచ్చింది. ఖాతాలు నిలిచిపోయినా అవినీతి సొమ్ము ఉందిగా దాన్ని వాడండి ఎన్నికలకు అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె పీ నడ్డా ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పై ఎటాక్ చేశారు.

Next Story
Share it