కాంగ్రెస్ జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో 21న
జీహెచ్ఎంసీ ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉండటంతో రాజకీయ పార్టీలు అన్నీ హైరానా పడుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలకు ఊపిరి తీసుకోవటానికి కూడా సమయం లేని పరిస్థితి. అయినా సరే ఎన్నికలు అంటే రంగంలోకి దిగాల్సిందే కదా. అందుకే పార్టీలు అన్నీ ఆగమేఘాల మీద బల్దియా పోరుకు రెడీ అవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ కూడా ఈ నెల 19వ తేదీన అభ్యర్థులకు బీ. ఫాం అందించనుంది. అదే సమయంలో 21 న కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార రెడ్డి ప్రకటించారు. మంగళవారం సాయంత్రం ఎన్నికల మేనేజ్ మెంట్, ప్లానింగ్ కమిటీ ని కూడా ప్రకటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా కమిటీలను ప్రకటించింది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి అంజన్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, జాఫర్ జావేద్, నిరంజన్, షేక్ అబ్ధుల్లాతో కమిటీని నియమించారు. ఈ నియోజకవర్గానికి పీసీసీ కో ఆర్డినేటర్ గా మాజీ మంత్రి షబ్బీర్ అలీని నియమించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి వీ. హనుమంతరావు, మర్రి శశిధర్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, పీ. విష్ణువర్ధన్ రెడ్డి, దాసోజు శ్రవణ్, సంతోష్ కుమార్ తో కమిటీ వేశారు.
ఈ స్థానానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీసీసీ కో ఆర్డినేటర్ గా వ్యవహరించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని చేవెళ్ల పార్లమెంట్ స్థానానికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అజారుద్దీన్, చల్లా నర్సింహారెడ్డి, భిక్షపతి యాదవ్, రాచమళ్ల సిద్ధేశ్వర్, దీపాభాస్కర్ రెడ్డితో కమిటీని నియమించారు. ఈ స్థానంలో పీసీసీ కో ఆర్డినేటర్ గా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యవహరించనున్నారు. మాల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానానికి ఎంపీ రేవంత్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, చల్లా నర్సింహారెడ్డి, నందికంటి శ్రీధర్, బడే సాబ్ తో కమిటీని పీసీసీ ప్రకటించింది. ఈ నియోజకవర్గానికి పీసీసీ కో ఆర్డినేటర్ గా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యవహరించానున్నారు. మెదక్ పార్లమెంట్ స్థానానికి మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహా, విజయశాంతి, గీతారెడ్డి, జగ్గారెడ్డి, గాలి అనిల్ కుమార్ ను నియమించింది. ఇక్కడ పీసీసీ కో ఆర్డినేటర్ గా జెట్టి కుసుమ కుమార్ ను నియమించారు.