ముఖ్యమంత్రులను మాట్లాడనివ్వరా?
మొన్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్. నేడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ప్రధాని నరేంద్రమోడీ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోడీ గత కొన్ని రోజులుగా మాట్లాడుతున్నారు. అయితే గురువారం నాడు జరిగిన సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. దీన్ని తాము అవమానంగా భావిస్తున్నామన్నారు. మోడీతో సమావేశం అనంతరం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ''ప్రధాని ముఖ్యమంత్రులను సమావేశానికి ఆహ్వానించారు.. కానీ మాతో మాట్లాడలేదు.. మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. కేవలం కొందరు బీజేపీ ముఖ్యమంత్రులు, ప్రధాని చిన్న చిన్న ప్రసంగాలు చేశారు. సమావేశం ముగిసింది అన్నారు. ఇది చాలా సాధారణ సమావేశంగా..సూపర్ ఫ్లాప్ సమావేశంగా ముగిసింది'' అన్నారు. ''ప్రధాని ప్రవర్తించిన తీరు మమ్మల్ని అవమానించినట్లుగా అనిపించింది.అని వ్యాఖ్యానించారు.
ఆయన టీకాల గురించి కానీ, రెమ్‌డెసివర్, బ్లాక్ ఫంగస్ కేసుల గురించి మాట్లాడలేదు. వ్యాక్సిన్‌ల కోసం డిమాండ్ చేయాలని భావించాం. కానీ మాకు మాట్లాడే అవకాశమే రాలేదు. గతంలో మాదిరిగానే ప్రధాని ఈ సారి కూడా కేసులు తగ్గుతున్నాయన్నారు. ఆయన చాలా అభద్రతాభావంతో ఉన్నారు. మేం చెప్పేది వినలేదు. ముఖ్యమంత్రులు అంటే వెట్టిచాకిరి చేసేవారు కాదు' అంటూ దీదీ మండిపడ్డారు. ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్‌తో సహా మరో ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల్లో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య, మరణాలు పెరుగుతున్నాయి. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన తెలిపింది. పశ్చిమ బెంగాల్ లోని అన్ని జిల్లాలు పాజిటివిటీ రేటు బాగా పెరిగింది. కోల్‌కతా, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, హౌరా, నాడియాలను ఆందోళన జిల్లాలుగా గుర్తించినట్లు కేంద్రం తెలిపింది.