ఉద్థవ్ ఠాక్రేతో భేటీకి ముంబయ్ కి కెసీఆర్
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా దాదాపు రెండేళ్ళ సమయం ఉండగానే దేశ రాజకీయాల్లో వేడి పుడుతోంది. ప్రధాని మోడీ టార్గెట్ గా పలువురు నేతలు ఇప్పుడు గళం విప్పుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నిక లు ముగిసి..మార్చి 10న ఫలితాలు వచ్చిన తర్వాత ఇందులో మరిన్ని మార్పులు రావటం ఖాయంగా కన్పిస్తోంది. ఇప్పటికే చాలా మందిలో మోడీపై కోపం ఉన్నా రకరకాల కారణాలతో దాన్ని బహిర్గతం చేయటం లేదు. మోడీ బలహీనపడ్డారన్న సంకేతాలు వస్తే చాలు ఈ దూకుడు మరింత పెరిగే అవకాశం కన్పిస్తోంది. ప్రస్తుతానికి మాత్రం తెలంగాణ సీఎం కెసీఆర్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్థవ్ ఠాక్రే, తమిళనాడు సీఎం స్టాలిన్ లు దూకుడు మీద ఉన్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ కూడా వీరితో జత కలిసేలా ఉన్నారు.
కొద్ది రోజుల క్రితమే మమతా బెనర్జీ తెలంగాణ సీఎం కెసీఆర్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత దేవేగౌడ కూడా కెసీఆర్ పోరాటానికి మద్దతు పలికారు. తాజాగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కూడా సీఎం కెసీఆర్ కు ఫోన్ చేశారు. కేంద్రంలోని మోడీ సర్కారుపై కెసీఆర్ తీసుకున్న వైఖరికి ఆయన మద్దతు పలికారు. దేశాన్ని విభజన శక్తుల నుంచి కాపాడుకోవటానికి సరైన సమయంలో ముందుకు కదలారని..ఈ దిశగా అందరం కలసి సాగుదామని ప్రకటించారు. ఇందుకు తమ వంతు సహకారం ఉంటుందని తెలిపారు. ఈ తరుణంలో సీఎం కెసీఆర్ ఫిబ్రవరి 20న ముంబయ్ వెళ్లి మహారాష్ట్ర సీఎం ఉద్థవ్ ఠాక్రేతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులు ప్రధాని మోడీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు దిశగా చర్చలు సాగే అవకాశం ఉంది.