సీఎం కెసీఆర్ దుబ్బాక రీసౌండ్ వినాలి
తెలంగాణలో నియంతృత్వ అప్రజ్వామిక పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని దుబ్బాకలో అనూహ్య విజయం సాధించిన బిజెపి అభ్యర్ధి రఘునందనరావు వ్యాఖ్యానించారు. సీఎం కెసీఆర్ తాను ఏ గడ్డపై అయితే చదువుకున్నానని చెబుతారో..ఆ గడ్డ రీసౌండ్ వినాలని అన్నారు. సిద్ధిపేటలో రిటర్నింగ్ అధికారి నుంచి గెలుపు ధృవపత్రం అందుకున్న తర్వాత రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. తన జీవితాన్ని దుబ్బాక ప్రజలకు అంకితం చేస్తానని ప్రకటించారు. ఓ వ్యక్తిని, కుటుంబాన్ని వేధించాలని చూసిన వారికి కనువిప్పు కలగాలన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, అసెంబ్లీ వేదికగా వారి తీరును ఎండగడతానని అన్నారు.
'దుబ్బాక ప్రజానీకానికి శిరస్సు వంచి నమస్సులు తెలుపుతున్నా . ఈ విజయం దుబ్బాక ప్రజలకు అంకితం . ఏ గడ్డ నుంచి అయితే తెలంగాణ ఉద్యమం ప్రారంచించామో గొంతెత్తామో అదే గడ్డ ఇచ్చిన తీర్పు ప్రగతి భవన్ వరకూ పోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, బండి సంజయ్‌కు ధన్యవాదములు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదిన నాయకుల్లా రా కలిసి రండి. ఏకమై పోరాడుదాం' అని వ్యాఖ్యానించారు. దుబ్బాకలో బిజెపి అభ్యర్ధి రఘనందన్ రావు టీఆర్ఎస్ అభ్యర్ధి సుజాతపై 1079 ఓట్లతో విజయం సాధించారు.