Telugu Gateway
Politics

కెసీఆర్ 2022లో ఎన్నిక‌లు కోరుకుంటున్నారు

కెసీఆర్ 2022లో ఎన్నిక‌లు కోరుకుంటున్నారు
X

సీఎం సీటు కోసం ప్ర‌గ‌తిభ‌వ‌న్ లో పంచాయ‌తీ

బండి సంజ‌య్ వ్యాఖ్య‌లు

ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కోసం ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో పంచాయ‌తీ మొద‌లైంద‌ని తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్, ఎంపీ బండి సంజ‌య్ వ్యాఖ్యానించారు. సీఎం ప‌ద‌వి కోసం కెసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య ప్రగతి భవన్ లో డైనింగ్ టేబుల్ వద్ద కొట్లాట మొదలైంద‌న్నారు. 'న‌న్ను సీఎం ఎప్పుడు చేస్తావని కొడుకు, బిడ్డ, అల్లుడు అడుగుతున్నడు. కేసీఆర్ అందుకే....ఉన్నన్నాళ్లూ నేనే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నడు. సీఎం సీటు కోసం కొడుకు, బిడ్డ, అల్లుడిని రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రశ్నించే గొంతును గెంటేస్తున్నరు. దీనికి ఉదాహరణ ఈటల రాజేందర్. ' అని వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ బండి సంజ‌య్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఉద్యమాల ఫలితంగా రాజకీయంగా పెనుమార్పులు సంభ‌వించాన్నారు. అవినీతి-నియంత-కుటుంబ పాలనను రాష్ట్ర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరు. అందుకు అనేక ఉదాహరణలున్నాయని పేర్కొన్నారు. 'ఇందిరా గాంధీ మొదలు మన్మోహన్ సింగ్ పాలన వరకు చూశాం. ప్రజలు ఆ కుటుంబ పాలనకు చరమగీతం పాడారు.రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ మొదలు చంద్రబాబు హయాం వరకు కుటుంబ, నియంత, అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు గుణపాఠం చెప్పారు.

తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోంది. నియంత, కుటుంబ‌ పాలన కొనసాగుతోంది. ప్రజల దృష్టి మళ్లించడానికి సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నరు. కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు పోయిండో అర్ధం కాలేదు. అపాయిట్ మెంట్ ఇవ్వలేదనే సాకుతో ఆత్మగౌరవం సెంటిమెంట్ ను రాజేద్దామనుకున్నడు. అపాయిట్ మెంట్ అడగనేలేదని పీఎంవో చెప్పినట్లు మీడియా రాయడంతో కేసీఆర్ కుట్ర ప్రజలకు అర్ధమైంది. సొంత పనుల కోసం ఢిల్లీకి పోయిన కేసీఆర్ అపాయిట్ మెంట్ పేరుతో బీజేపీని అప్రతిష్టపాల్జేయాలని కుట్ర చేసిండు. ఓ జ్యోతిష్కుడు చెప్పిండు కేసీఆర్ కు....నీ రాజకీయ పతనం ప్రారంభమైంది. ఎన్ని పూజలు చేసినా వేస్ట్. నువ్వు శిశుపాలుడువయ్యావని చెప్పిండట. ప్రజలు చీదరించినా, చీత్కరించినా.....బీజేపీని నవ్వులపాలు చేయాలి, బీజేపీని అడ్డుకుంటే తిరుగులేదని భావించే కేసీఆర్ నీచమైన కుట్రకు పాల్పడ్డరు. నాకూ ఓ జ్యోతిష్కుడు కలిసిండు....తెలంగాణ ప్రజలకు మంచి రోజులు రాబోతున్నయ్. పేదలకు న్యాయం జరగబోతోంది. తెలంగాణ తల్లికి విముక్తి కాబోతోంది. బీజేపీతోనే అది సాధ్యం కాబోతుందని ఆ జ్యోతిష్కుడు చెప్పిండు.

అందుకోసం రక్తాన్ని ధారపోయాల్సి ఉంటుందని చెప్పిండు. మీ అందరినీ అడుగుతున్నా....త్యాగాలకు మీరు సిద్ధమా? రక్తాన్ని ధారపోసేందుకు మీరు సిద్ధమైతే గడీల పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించే బాధ్యత నాది. ఉద్యమకారులకు టీఆర్ఎస్ లో స్థానం లేదు...రాజేందరన్న లాంటి వాళ్లకు బయటకు పంపుతున్నరు. హిందువులంతా సంఘటితమై ఓటు బ్యాంకుగా మారితే ఎలాంటి ఫలితాలు వస్తాయో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చూసినం. ప్రశ్నించే గొంతును బయటకు పంపితే ప్రజలు ఏం గుణపాఠం చెబుతారో హుజూరాబాద్ ఎన్నికల్లో రుజువైంది.హుజూరాబాద్ లో గెలిచిన ఈటల రాజేందర్ కు నా అభినందనలు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నా అభినందనలు. కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలు ఒక స్పూర్తిలా నిలిచాయి. టీఆర్ఎస్ పార్టీ రూ.500 కోట్లు ఖర్చు పెట్టినా ప్రజలు సీఎం చెంప చెళ్లుమనేలా బీజేపీకి ఘన విజయం అందించారు.

సీఎం 2022లోనే ఎన్నికలు రావాలని కోరుకుంటున్నడు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా అధికారంలోకి వచ్చేది బీజేపీ మాత్రమే. సీఎంను హెచ్చరిస్తున్నా...నువ్వు ఎన్న కుట్రలు, కుతంత్రాలు, దుష్ప్రచారాలు చేసినా నీ పప్పులు ఉడకవు. ప్రజలు నీకు గుణ పాఠం చెప్పడం తథ్యం. బీజేపీ కార్యకర్తలు అధికార పార్టీ లాఠీలకు భయపడలేదు. జైలుకు పోయిండ్రు. త్యాగాలకు సిద్దమైండ్రు. ఎంతోమంది ప్రాణత్యాగం చేసిండ్రు. వాళ్ల ఆశయాలను నెరవేర్చేందుకు అందరం కలిసి తెగించి కొట్లాడదాం. 2022లోనైనా 2023లో ఎన్నికలొచ్చినా... నరేంద్రమోదీ, అమిత్ షా అండతో...జేపీ నడ్డా నాయకత్వంలో గొల్లకొండపై కాషాయ జెండాను రెపరెపలాడిద్దాం. ఆ దిశగా ప్రతి ఒక్కరూ ఐక్యమై క్రమశిక్షణతో టీఆర్ఎస్ కుటుంబ-అవినీతి-నియంత పాలనపై పోరాడుదాం'. అని ప్ర‌క‌టించారు.

Next Story
Share it