Telugu Gateway
Politics

కవిత నోటీసు కూ... తెలంగాణ కు సంబంధం ఏమిటి ?!

కవిత నోటీసు కూ... తెలంగాణ కు సంబంధం ఏమిటి ?!
X

ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె,ఎమ్మెల్సీ కవిత అయినా..మరొకరిపై అయినా ఏదైనా దర్యాప్తు సంస్థ కేసు దాఖలు చేస్తే విచారణలోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఇది దేశంలో అమలులో ఉన్న పద్ధతి. అలాగని రాష్ట్ర ప్రభుత్వాలు...కేంద్ర ప్రభుత్వాలు అక్రమ కేసు లు పెట్టవని చెప్పటానికి లేదు. గతంలో కెసిఆర్ తెలంగాణ ను తన రాజకీయ అవసరాల కోసం ఎలా వాడుకున్నారో..ఇప్పుడు కవిత కూడా తనపై వచ్చిన ఆరోపణలకు తెలంగాణ పేరును తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోంది. అందుకే లిక్కర్ స్కాం లో ఈడీ నోటీసు లపై స్పందించిన కవిత ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనకు పైన ‘తెలంగాణ తల వంచదు !! ’ అని పెట్టారు.

కవిత నోటీసులకు అసలు తెలంగాణకు సంబంధం ఏమిటి?. ఈ ఆరోపణలు రాక ముందు ..ఈ కేసు వెలుగు చూడక ముందు అసలు పరోక్షంగా కానీ...ప్రత్యక్షంగా కానీ లిక్కర్ వ్యాపారంలో ఉన్నట్లు కవిత తెలంగాణ ప్రజలకు ఏమైనా చెప్పారా అని ఒక నేత వ్యాఖ్యానించారు. కానీ కేసు లో ఆరోపణలు ఎదుర్కొంటూ...సిబిఐ, ఈడీ నోటీసు లు జారీ చేస్తే మాత్రం తెలంగాణ పేరును మరో సారి తమ అవసరాలకు వాడుకోవడానికి సిద్ధం అయ్యాను అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నోటీసు లపై కవిత ప్రకటన ఇలా ఉంది....

తెలంగాణ తల వంచదు !!

రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నది మా డిమాండ్. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టింది.

ఈ క్రమంలోనే మార్చి 9న ఢిల్లీలో విచారణకు రావాల్సిందిగా ఈడి నాకు నోటీసులు జారీ చేసింది.

చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా నేను దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తాను. కానీ ధర్నా మరియు ముందస్తు అపాయింట్మెంట్ల రీత్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటాను.

ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్ ని, బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవడం కుదరదని బిజెపి తెలుసుకోవాలి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగాడుతూనే ఉంటాము. దేశ అభ్యున్నతి కోసం గొంతెత్తుతాము.

ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదని ఢిల్లీలో ఉన్న అధికారకంక్షపరులకు గుర్తుచేస్తున్నాను. ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం చేస్తాము.

జై తెలంగాణ !!

జై భారత్ !!

అంటూ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ వ్యవహారంపై బిఆర్ఎస్ నేతలు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. అటు కేంద్రం లోని మోడీ సర్కారు , ఇటు బీజేపీ పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.

Next Story
Share it