రైతు బంధు ఆగదు
తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) కేంద్రంపై పోరు తీవ్రతరం చేస్తోంది. గత కొంత కాలంగా కేంద్ర సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్న టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ కొత్త కార్యాచరణను ప్రకటించారు. శుక్రవారం నాడు హైదరాబాద్ లో నిర్వహించిన పార్టీ సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీఎం కేసీఆర్ పార్టీ నేతలను ఆదేశించారు. కేంద్రం వైఖరిని నిలదీస్తూ.. ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ, కేంద్రం దిష్టి బొమ్మలను దగ్దం చేయాలన్నారు. వరికి బదులుగా ఇతర పంటలు వేయాలని సూచించారు.
ఈ నెల 18న రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర మంత్రిని కలవనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. మంత్రులంతా కార్యక్రమాలు రద్దు చేసుకొని ఢిల్లీ వెళ్లాలని ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రమంత్రిని కలవాలని మంత్రులను ఆదేశించారు. సమయం ఇవ్వకపోతే అక్కడే కూర్చోండి..తేల్చుకొని రండని ఆయన స్పష్టం చేశారు. రైతులంతా కష్టాల్లో ఉన్నారన్నారు. తాను కూడా ఎల్లుండి పర్యటనలు రద్దు చేసుకుంటున్నానని కేసీఆర్ పేర్కొన్నారు.
రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు అమలు చేస్తామని శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. వరివేస్తే రైతులకు రైతు బంధు ఆపాలని తెలిపిన అధికారుల సూచనలను కేసీఆర్ తిరస్కరించారు. అధికారుల సూచనలపై తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించిన సీఎం.. రైతు బంధు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని స్పష్టం చేశారు. దళిత బంధు పథకాన్ని దశల వారీగా రాష్ట్రమంతా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. దళితబంధుపై విపక్షాల రాద్ధాంతం చేస్తున్నాయని, వాటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కేసీఆర్ స్పష్టంచేశారు. మొదట హుజురాబాద్‌తో పాటు నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో పూర్తిస్థాయిలో దళితబంధు అమలు చేస్తామని, తరువాత రాష్ట్ర వాప్తంగా అమలు చేస్తామని కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు.