ఢిల్లీ వెళ్లొచ్చాకే కెసీఆర్ మారారు
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై ముఖ్యమంత్రి కెసీఆర్ తన వైఖరి ఏంటో చెప్పాలని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తొలుత ఈ చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడిన కెసీఆర్ ఢిల్లీ వెళ్ళొచ్చాక మాత్రం రైతుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని విమర్శించారు. ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ లో జరిగిన రైతుల హత్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా మౌనదీక్షలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇందిరాపార్క్ వద్ద మౌనదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆజయ్ మిశ్రాను వెంటనే కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
కేంద్రం తెచ్చిన చట్టాల వల్ల రైతులు తమ భూముల్లోనే కూలీలుగా మారిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ చట్టాలు రైతులకు మరణశాసనాలుగా మారబోతున్నాయని పేర్కొన్నారు. రెండుసార్లు బిజెపికి అధికారం కట్టబెట్టిన రైతులకు మోడీ సర్కారు ఇంత దారుణంగా వ్యవహరించటం ఏ మాత్రం సరికాదని రేవంత్ మండిపడ్డారు. రైతులే కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపాలని కంకణం కట్టుకున్నారని..ఇందుకే ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ, సీనియర్ నేత షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.