Telugu Gateway
Politics

కెసీఆర్ కూడా అదే బాట‌లో

కెసీఆర్ కూడా అదే బాట‌లో
X

దేశంలోని విప‌క్ష ముఖ్య‌మంత్రుల బాట‌లోనే తెలంగాణ సీఎం కెసీఆర్ కూడా చేరారు. రాష్ట్రాల అనుమ‌తితో సంబంధం లేకుండా కేంద్రం త‌మ‌కు న‌చ్చిన ఐఏఎస్ అధికారుల‌ను పిలిపించుకునేలా చేసిన స‌వ‌ర‌ణ ప్ర‌తిపాద‌న‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఫెడ‌ర‌ల్ స్పూర్తికి విరుధ్ధం అని..రాష్ట్రాల హ‌క్కులను హ‌రించ‌ట‌మే అంటూ ప‌లువురు సీఎంలు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. సీఎం కెసీఆర్ కూడా ఇదే అంశంపై సోమ‌వారం నాడు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి లేఖ రాశారు. ఇందులో ఆయ‌న కేంద్ర నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌ట్టారు. అఖిల భార‌త అధికారుల సర్వీస్ రూల్స్ సవరణపై లేఖలో అభ్యంతరం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్‌.. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రాల్లో పని చేసే అధికారులను కేంద్రం పరోక్షంగా నియంత్రించే ఎత్తుగడగా లేఖలో అభివర్ణించారు. నిబంధనలను సవరించడం వల్ల రాష్ట్ర పరిపాలన చిక్కుల్లో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవరణలు ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్న సీఎం కేసీఆర్‌.. ఐఏఎస్ క్యాడర్ రూల్స్ మార్పు నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని లేఖలో పేర్కొన్నారు. ఐఏఎస్ కేడర్ రూల్స్ 1954ను మార్చాలన్న నిర్ణయంపై విరమించుకోవాలని పలువురు ముఖ్యమంత్రులు ఇదివరకే డిమాండ్ చేశారు. తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ ట్విటర్‌ వేదికగా అభ్యంతరం వ్యక్తం చేయగా. ఐఏఎస్ డిప్యూటేషన్ విషయంలో కేంద్రం ప్రతిపాదించిన మార్పులు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయని కేరళ సీఎం పినరయి విజయన్ అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ తదితరులు ఇప్పటికే ప్రధానికి లేఖలు రాశారు.ఇప్పుడు ఆ జాబితాలో కెసీఆర్ కూడా చేరారు. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కానీ..అధికార వైసీపీ ఇప్ప‌టివ‌ర‌కూ ఈ అంశంపై ఎక్క‌డా స్పందించిన దాఖ‌లాలు లేవు.

Next Story
Share it