Telugu Gateway
Politics

జగన్ కు డబల్ ట్రబుల్!

జగన్ కు డబల్ ట్రబుల్!
X

వైసీపీ కి ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తు టెన్షన్ ఉంది?. ఇది సరిగా వర్క్ అవుట్ అయితే కొంప కొల్లేరే అన్న భయంతో సాధ్యమైనంత మేర ఈ పొత్తు ఫలితాన్ని డైల్యూట్ చేసేందుకు ఎన్ని ఎత్తులు వేయాలో అన్నీ వేస్తుంది. అందుకే టీడీపీ నుంచి పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న సీట్ల విషయంలో ఆ పార్టీ నేతల కంటే కూడా వైసీపీ మంత్రులు...ఆ పార్టీ నేతలే ఎక్కువ రియాక్ట్ అవుతున్న విషయం తెలిసిందే. ఇది జనసేన పై ప్రేమ ఏ మాత్రం కాదు అనే విషయం రాజకీయాలపై కనీస అవగాహనా ఉన్న వాళ్లకు ఎవరికైనా తెలిసిందే. అందుకే అటు సోషల్ మీడియాతో పాటు బయట కూడా ఎంత రచ్చ చేయాలో అంత చేస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ కి తమ వంతుగా ముద్రగడ పద్మనాభం, హరి రామ జోగయ్య లు సహకరిస్తున్నారు. ఇది అంతా ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతుంది అనే అనుమానాలు కూడా లేకపోలేదు. టీడీపీ, జన సేన ల పొత్తు అసలు ప్రయోజనం ఆ రెండు పార్టీ లకు దక్క కుండా చేసేందుకు అధికార వైసీపీ శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన వై ఎస్ షర్మిల ఇప్పటికే వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి పై డైరెక్ట్ ఎటాక్ చేస్తున్నారు. జగన్ తెస్తానన్న ప్రత్యేక హోదా ఏమైంది..పోలవరం ఎక్కడ ?. ఏటా జనవరి లో విడుదల చేస్తానన్న జాబ్ క్యాలెండరు ఎందుకు విడుదల కాలేదు అంటూ షర్మిల చేస్తున్న విమర్శలకు వైసీపీ దగ్గర సమాధానాలు లేవు అనే చెప్పొచ్చు. కాంగ్రెస్ తరపున వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్న షర్మిల ఖచ్చితంగా ఎంతో కొంత వైసీపీ ఓటు బ్యాంకు ను చీలుస్తుంది అనే లెక్కలు ఉన్నాయి. అది ఎంత మేర అన్నది తెలియాలంటే మాత్రం ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సిందే. విభజన జరిగి పదేళ్లు దాటినందున ఆంధ్ర ప్రదేశ్ ప్రజల్లో కాంగ్రెస్ పై ఉన్న కోపం చాలా వరకు తగ్గుముఖం పట్టింది అనే చెప్పాలి.

ఒక వైపు వైసీపీ షర్మిల విమర్శలతోనే ఉక్కిరిబిక్కరికి అవుతుంటే...శుక్రవారం నాడు జగన్ బాబాయ్ వై ఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత ఢిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు వైసీపీ వర్గాలను షాక్ కు గురి చేసేలా ఉన్నాయనే చెప్పొచ్చు. ఆమె కూడా నేరుగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ కి ఓటు వేయవద్దని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు. హత్యా రాజకీయాలు చేసే వాళ్ళు మనని పాలించకూడదు అంటూ వ్యాఖ్యానించారు. వై ఎస్ వివేకానంద రెడ్డి హత్యను వైసీపీ గత ఎన్నికల్లో రాజకీయంగా వాడుకున్న విషయం తెలిసిందే. ఈ హత్య వెనక అప్పటి టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఉన్నట్లు సాక్షిలో సైతం నారాసుర రక్త చరిత్ర అంటూ భారీ ఎత్తున ప్రచారం చేశారు. జగన్ దగ్గర నుంచి వైసీపీ నేతలు అంతా కూడా ఇదే విషయంలో బహిరంగంగానే ఆరోపణలు చేశారు. కానీ సిబిఐ విచారణలో ఈ హత్య కేసు కు సంబంధించి వై ఎస్ భాస్కర్ రెడ్డి తో పాటు వై ఎస్ అవినాష్ రెడ్డి పేర్లు బయటకు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారం అటు వైసీపీ తో పాటు ముఖ్యంగా సీఎం జగన్ ను మరింత ఇరకాటంలోకి నెట్టింది. సహజంగా హత్య కేసు ల్లో నిందితులను ఐదారు రోజుల్లోనే గుర్తిస్తారు అని...కానీ తన తండ్రి హత్య జరిగి ఐదు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికి ఈ విషయాన్ని తేల్చకపోవటం సరికాదు అన్నారు. ఒత్తిళ్ల వల్ల సిబిఐ విచారణ ఏ మాత్రం ముందుకు సాగటం లేదు అన్నారు. సొంత వాళ్ళను అంత సులువు అనుమానించి లేం అని...అందుకే తొలుత తన తండ్రి హత్య కేసు విషయంలో జగన్ కలిసినప్పుడు ఆయనపై తనకు ఎలాంటి అనుమానం రాలేదు అన్నారు. జగన్, భారతి పాత్రలు ఇందులో ఉన్నాయో లేదో సిబిఐ విచారణలోనే తేలాలి అన్నారు. వైసీపీ ఇప్పటికే షర్మిల పై సోషల్ మీడియా లో బయట పెద్ద ఎత్తున ఎటాక్ చేస్తోంది. ఇక ఇప్పుడు ఆ జాబితాలోకి సునీత కూడా చేరటం ఖాయం అనే చెప్పొచ్చు.

Next Story
Share it