Telugu Gateway
Politics

తిరుపతి ఉప ఎన్నికపై జగన్ కీలక వ్యాఖ్యలు

తిరుపతి ఉప ఎన్నికపై జగన్ కీలక వ్యాఖ్యలు
X

అధికార వైసీపీ తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే డాక్టర్ గురుమూర్తిని అభ్యర్ధిగా ప్రకటించింది. కీలక నేతలతో జగన్ ఎన్నిక అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 'దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా ఉప ఎన్నిక ఫలితాలు రావాలి. తిరుపతిలో వచ్చిన మెజార్టీ ఒక మెసేజ్‌గా ఉండాలి. మహిళా సాధికారత, మహిళలకు జరిగిన మేలును కూడా తెలపాలి. ప్రతి నియోజకవర్గానికి ఇన్‌ఛార్జ్‌ గా మంత్రి, ఎమ్మెల్యే అదనంగా ఉంటారు. సమన్వయంతో పనిచేసి డా. గురుమూర్తిని మంచి మెజార్టీతో గెలిపించాలి'' అని కోరారు జగన్.

ఈ సమావేశంలోనే సీఎం జగన్ వైసీపీ లోక్ సభ అభ్యర్ధి గురుమూర్తిని పార్టీ నేతలకు పరిచయం చేశారు. ''అభివృద్ధి, సంక్షేమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కుల, మత, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. తిరుపతి పార్లమెంట్ పరిధిలో పార్టీ శ్రేణులు ప్రతి గడపకు వెళ్లాలి. అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలన్నారు. తాజాగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన కిక్ తో జోష్ లో ఉన్న వైసీపీ ఈ ఉప ఎన్నికలో తేలిగ్గా విజయం సాధిస్తామనే ధీమాతో ఉంది. అయితే ఈ ఎన్నిక విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంతో వ్యవహరించవద్దని పార్టీ నేతలను ఆదేశించారు.

Next Story
Share it