Telugu Gateway
Politics

అఖిలపక్షంతో వస్తాం..అపాయింట్ మెంట్ ఇవ్వండి

అఖిలపక్షంతో వస్తాం..అపాయింట్ మెంట్ ఇవ్వండి
X

ప్రధాని మోడీకి లేఖ రాసిన సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీకి మరోసారి లేఖ రాశారు. ఏపీ ప్రజల సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని..కేంద్రం తన నిర్ణయాన్ని పరిశీలించాలని కోరారు. ఈ అంశంపై వివరించేందుకు అఖిలపక్షంతో వస్తామని..అపాయింట్ మెంట్ ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఈ లేఖను మీడియాకు విడుదల చేశారు. అఖిలపక్ష నేతలతోపాటు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘ నేతలను కూడా తీసుకొస్తామన్నారు. ''కేంద్ర ప్రకటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఆంధ్రుల మనోభావాలతో ముడిపడిన అంశం. స్టీల్‌ప్లాంట్‌పై ప్రత్యక్షంగా 20వేల కుటుంబాలు ఆధారపడ్డాయి. ఏపీ ప్రజలు, కార్మికుల అభిప్రాయాలను మీ ముందు ఉంచుతాం.

ప్లాంట్‌ పునరుద్ధరణకై మన ముందున్న ఆప్షన్లను నేరుగా వివరిస్తాం'' అని సీఎం వైఎస్‌ జగన్‌ తన లేఖలో పేర్కొన్నారు. ప్లాంట్‌పై దృష్టిపెడితే ఖచ్చితంగా లాభాల్లోకి వచ్చే అవకాశం ఉందని పునరుద్ఘాటించారు. గతంలోనూ సీఎం జగన్ ఇదే అంశంపై ప్రధాని మోడీకి లేఖ రాశారు. బ్యాంకు రుణాలను ఈక్విటీ గా మార్చాలని..అదే సమయంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు సొంత ఇనుప ఖనిజం గనులు కేటాయించేలా చూడాలని కోరారు. ఈ లేఖ రాసిన తర్వాత కూడా కేంద్రం వైఖరిలో ఏ మాత్రం మార్పు లేకపోగా..మరింత స్పష్టంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ తోపాటు అనుబంధ సంస్థల్లో వాటాలను పూర్తిగా విక్రయిస్తామని ప్రకటించింది.

Next Story
Share it