అసంతృప్త నేతలతో జగన్ భేటీ
ఏపీలో నూతన మంత్రివర్గ ఏర్పాటు సందర్భంగా తలెత్తిన అసంతృప్తి, అసమ్మతి సెగలను సర్దుబాటు చేసేందుకు సీఎం జగన్ రంగంలోకి దిగారు. అందులో భాగంగా ఆయన వరస పెట్టి ఎమ్మెల్యేలతో సమావేశం అయి పలు హామీలు ఇస్తున్నారు. జగన్ తో భేటీ అయిన అనంతరం బయటికి వచ్చిన నేతలు అందరూ అంతా ఓకే చెప్పేస్తున్నారు. దీంతో అసమ్మతి, అసంతృప్తి చల్లబడినట్లే కన్పిస్తోంది. సీనియర్ నేతలుగా ఉన్న పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి, పార్ధసారధి, సామినేని ఉదయభానుకు ఈ సారి పునర్ వ్యవస్థీకరణలో అవకాశం రాకపోవటంతో వారి వారి అనుచరులు బహిరంగంగా నిరసన ప్రదర్శనలు చేయటంతోపాటు..పార్టీకి వ్యతిరేకం నినాదాలు..ధర్నాలు కూడా చేశారు. సీఎం జగన్ నేరుగా వీరితో మాట్లాడటంతో నేతలు అందరూ కూడా మెత్తపడ్డారు. తాము అందరం 2024లో పార్టీ గెలుపు కోసం పనిచేస్తామని ప్రకటిస్తున్నారు.
జగన్ తో సమావేశం అనంతరం పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను మొదటి నుంచీ జగన్ వెంటన నడిచిన వ్యక్తినని అన్నారు. సామాజిక సమీకరణల్లో భాగంగా సీఎం జగన్.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు భాగస్వామ్యం కల్పించారని తెలిపారు. అందువల్ల సీనియర్లకు అవకాశం రాలేదని అన్నారు. తమ టార్గెట్ 2024 ఎన్నికలు అని, దానికోసం ఏ బాధ్యత ఇచ్చినా పూర్తిస్థాయిలో పని చేస్తానని ఎమ్మెల్యే పిన్నెల్లి తెలిపారు. పిన్నెల్లి భేటీ తర్వాత సీనియర్ ఎమ్మెల్యేలు పార్ధసారధి, ఉదయభానులు కూడా సీఎం జగన్ తో భేటీ అయ్యారు. జగన్ తో భేటీ తర్వాత అందరూ కూడా తాము పార్టీ కోసం పనిచేస్తామని..మంత్రివర్గ జాబితాలో తమ పేరు లేకపోవటంతో తమ అనుచరులు కొంత అసంతృప్తికి గురైన మాట వాస్తవమే అని..తర్వాత తామే వారితో మాట్లాడామన్నారు.