సినీ హీరోలను జగన్ ఘోరంగా అవమానించారు
ఏపీ సీఎం జగన్ పై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. లేని సమస్యను సృష్టించి టాలీవుడ్ కు చెందిన హీరోలను జగన్ అవమానించారన్నారు. స్వశక్తితో ఎదిగిన చిరంజీవిలాంటి వాళ్ళు జగన్ ను ప్రాధేయపడాలా అని ప్రశ్నించారు. ప్రపంచ స్థాయికి ఎదిగిన సినీ పరిశ్రమను జగన్ తన వైఖరితో కించపర్చారన్నారు. ప్రత్యేక హోదాపై జగన్ యుద్ధం ఎక్కడ అని ప్రశ్నించారు. గతంలో రాజీనామాలు సవాళ్లు విసిరిన జగన్ ..ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు. సోమవారం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎజెండాలో ప్రత్యేక హోదా తమ ఘనతే అని చెప్పుకుని.. ఇప్పుడు తమపై బురద జల్లుతారా? అని ప్రశ్నించారు.
ఏపీ ఆదాయం తగ్గకపోయినా ఆర్థికవ్యవస్థను నాశనం చేశారని విమర్శించారు. ఏపీని ఈశాన్య రాష్ట్రాల కంటే దారుణంగా మార్చారన్నారు.విద్యార్థులకు బడులను దూరం చేయడమే నాడు నేడు పథకమా? అని ప్రశ్నించారు. కరెంట్ సరఫరా లేదు కానీ.. అధిక బిల్లులు మాత్రం వస్తున్నాయని, మోటర్లకు మీటర్ల బిగింపును ప్రభుత్వం నిలిపివేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో ఎందుకు చేతులు ముడుచుకు కూర్చున్నారని ప్రశ్నించారు.