Telugu Gateway
Politics

సొంత జిల్లాకు కష్టం వస్తే పర్యటించలేని సీఎం ఎందుకు?

సొంత జిల్లాకు కష్టం వస్తే పర్యటించలేని సీఎం ఎందుకు?
X

వ‌ర‌ద బాదితుల‌ను ఆదుకోవ‌టంలో జ‌గ‌న్ స‌ర్కారు పూర్తిగా విప‌ల‌మైంద‌ని జ‌న‌సేన మండిప‌డుతోంది. సొంత జిల్లాకు కష్టం వస్తే పర్యటించలేని సీఎం ఎందుకు? అంటూ జ‌నసేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ ఛైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో మాత్రం మండ‌లానికో మంత్రి..గ్రామానికో ఎమ్మెల్యేను పంపిస్తారు..వ‌ర‌ద‌లు..స‌మ‌స్య‌లు వ‌స్తే మాత్రం ప‌ట్టించుకోరా అని ప్ర‌శ్నించారు. ఇసుక వ్యాపారం కోసం రాష్ట్రాన్ని అమ్మేశార‌ని, ఇసుక మాఫియా వ‌ల్లే క‌డ‌పకు ఇప్పుడు ఈ క‌ష్టం వ‌చ్చింద‌ని ఆరోపించారు. వరదలు, భారీ వర్షాలతో సర్వం కోల్పోంయిన నిర్వాసితులు చెట్ల కింద బతుకుతుంటే ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తూతూ మంత్రంగా ఏరియల్ సర్వే నిర్వహించి వెళ్లిపోవడం దురదృష్టకరమన్నారు హెలీకాప్టర్ వేసుకువచ్చి తిరిగి వెళ్లిపోయి ఎక్కడో కూర్చుకుని కబుర్లు చెబితే ఎలా అన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా దెబ్బ తిన్న గ్రామాల్లో పర్యటించి భరోసా కల్పించి ప్రభుత్వం నుంచి తక్షణం సహాయం అందించాలని డిమాండ్ చేశారు. కడప జిల్లాలో భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రాంతాల్లో బుధవారం నాదెండ్ల మనోహర్ పర్యటించారు. అన్నమయ్య డామ్ కట్ట దిగువ ప్రాంతంలో వరద ముంపుకు గురైన నందలూరు మండలం తొగురుపేటలో బాధితులను పరామర్శించారు. కూలిపోయిన ఇళ్లను పరిశీలించి వారికి ధైర్యం చెప్పారు.

వరద తీవ్రత, ప్రభుత్వ సాయంపై ఆరా తీశారు. బాధితులకు నిత్యావసరాలు, దుప్పట్లు, పాత్రలు అందించారు. ఇంత విపత్తు వస్తే సహాయం కోసం జిల్లాకు రెండు కోట్ల రూపాయలా ఇచ్చేది? ఇంతకన్నా దారుణం ఉంటుందా? ఇన్ని కుటుంబాలు రోడ్డున పడితే స్థానికంగా ఉన్న నాయకులు ఏమయ్యారు? ఇంతకంటే దారుణం ఉంటుందా? ఇతర గ్రామాల నుంచి ప్రజలు వచ్చి సాటి వారికి సాయం అందిస్తుంటే ప్రభుత్వం నుంచి ఎందుకు సహాయ కార్యక్రమాలు లేవో తెలియడం లేదన్నారు.సీఎం లక్షల కోట్ల బడ్జెట్ అని పెద్దపెద్ద మాటలు చెబుతారుగా మీ సొంత జిల్లాలో మాత్రం పర్యటించలేరు. ఇంతకంటే అధ్వాన్నమైన పరిస్థితి ఉంటుందా. గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోయాయి. ఇళ్లు, గుళ్ళు కొట్టుకుపోయాయి, రహదారులు, చెట్లు, పశుసంపద పోయింది. పొలాలు పోయాయి. నాలుగు రోజులుగా కనీసం వైద్య సదుపాయాలు లేవు. ఇప్పటి వరకు గ్రామాలకు కరెంటు సదుపాయం కూడా పునరుద్ధరించ లేదు. చిన్నపిల్లలతో బిక్కుబిక్కు మంటూ ఆరుబయట ఇసుకలోనే కాలం వెళ్లదీసే పరిస్థితి కనిపిస్తోందని తెలిపారు. కడప నుంచి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అందరికంటే పెద్ద మంత్రి ప్రభుత్వ సలహాదారు ఉన్నారు. ఏమైనా ప్రశ్నిస్తే ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్షాలను దూషిస్తారు. ప్రజలకు కష్టం వస్తే మీరెందుకు రావడం లేదు. మీరు ఎందుకు మాట్లాడడం లేదు. ప్రజలు కలెక్టర్ కి, ఆర్డీవోకి ఓటు వేశారా? మంచి పాలన అందిస్తారని జగన్ రెడ్డిని సొంత కుమారుడిగా భావించి ఆశీర్వదించి ప్రజలు ఓటు వేశారు. 151 సీట్లు కట్టబెడితే ఇలా ప్రవర్తించడం చాలా బాధ కలిగిస్తోంది. ఇళ్లు కొట్టుకుపోయి మహిళలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. రెవెన్యూ అధికారులు ఏమైపోయారో తెలియడం లేద‌ని మండిప‌డ్డారు.

Next Story
Share it