Telugu Gateway
Politics

షర్మిలనూ మోసం చేసిన జగన్

షర్మిలనూ మోసం చేసిన జగన్
X

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నాడు కర్నూలులో పర్యటించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిలకు ఆస్తులు, పదవులు ఇవ్వకుండా సీఎం జగన్ మోసం చేశారని ఆరోపించారు. వైఎస్ షర్మిల తెలంగాణలో రోడ్డుపై పడిందని వ్యాఖ్యానించారు. కర్నూలులో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడుతూ జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ ఓ పిరికి పంద అని ధ్వజమెత్తారు. జగన్‌కు దమ్ముంటే తన విమర్శలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.

మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో దోషి ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ఏం పీకారని జగన్‌కు ఓటేస్తారని, ఆయనకు దమ్ముంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలకు రావాలని చంద్రబాబు అన్నారు. టీడీపీని గెలిపిస్తే చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు చంద్రబాబు వివరిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ పాలనలో అభివృద్ధి సాగగా..జగన్ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరుగుతోందని విమర్శించారు.

లాయర్ల నిరసన

కర్నూలు పర్యటన సందర్భంగా చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. కర్నూలుకు హైకోర్టు రాకుండా అడ్డుకున్నారంటూ కొంత మంది లాయర్లు చంద్రబాబు ప్రచారానికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారు. నగరానికి హైకోర్టు రావటానికి అనుకూలంగా ప్రకటన చేయాలంటూ పట్టుపట్టారు. ఆందోళన చేస్తున్న లాయర్లను పోలీసులు పక్కకు తప్పించటంతో చంద్రబాబు తన ప్రచారాన్ని సాగిస్తూ వెళ్లారు.

Next Story
Share it