Telugu Gateway
Politics

పార్లమెంట్ లో వైసీపీ లేవనెత్తేవి ఇవే

పార్లమెంట్ లో వైసీపీ లేవనెత్తేవి ఇవే
X

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఏపీకి సంబంధించిన కీలక అంశాలను లేవనెత్తుతామని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వెల్లడించారు. సోమవారం నాడు తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈనెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా వంటి అంశాలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం నిధులు, ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని తెలిపారు.

నివర్ తుపాను నష్టపరిహారం విడుదల చేయాలని కోరతామని పేర్కొన్నారు. ''కర్నూలుకు హైకోర్టు తరలింపు అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తాం. రాష్ట్ర రెవెన్యూ లోటును పార్లమెంట్‌ దృష్టికి తీసుకెళ్తాం. విశాఖ రైల్వే జోన్‌ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తాం'' అని తెలిపారు. కాగా రాష్ట్రంలో దేవుడి విగ్రహాల ధ్వంసంలో చంద్రబాబు ప్రమేయం ఉందన్న వియసాయిరెడ్డి.. ఆలయాలపై టీడీపీ దాడుల ఘటనపై ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయాన్ని కూడా పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశాలు లోక్ సభ, రాజ్య సభ సభ్యులు పాల్గొన్నారు.

Next Story
Share it