జగన్ వెంటే నడుస్తా
ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ సందర్భంగా తలెత్తిన అలకలు..అసంతృప్తి నేతల బుజ్జగింపులు పూర్తయినట్లే కన్పిస్తోంది. మంగళవారం నాడు సీనియర్ నేతలు పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి, పార్ధసారధి, ఉదయభాను తదితర నేతలు సీఎం జగన్ తో సమావేశం అయి ఏవో హామీలు పొంది ఊరట చెందారు. మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత బుధవారం నాడు సీఎంతో జగన్ తో సమావేశం అయ్యారు. తాను పంపింది ఒక లేఖ అయితే.. రాజీనామా లేఖ అంటూ తప్పుడు ప్రచారం చేశారని సుచరిత ఆరోపించారు. తాను రాజీనామా చేయలేదని, అవన్నీ అవాస్తవాలేనని స్పష్టం చేశారు. సీఎంతో సుమారు గంటన్నర భేటీ అయ్యారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో తనకు వీసమెత్తు అవమానం కూడా జరగలేదన్నారు.
జడ్పీటీసీ స్థాయి నుంచి హోంమంత్రి వరకు తనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవకాశం ఇచ్చారని తెలిపారు. కేబినెట్‌లో కొంతమందిని మారుస్తామని సీఎం జగన్ ముందే చెప్పారని అన్నారు. కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యల వల్లే ఇంటి నుంచి బయటకు రాలేకపోయానని తెలిపారు. కేబినెట్ పునర్‌వ్యవస్థీరణలో సీఎం జగన్ నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని సుచరిత తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ కుటుంబంలో మనిషిగా తనను ఎప్పుడూ ఆదరిస్తారని తెలిపారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం సీఎం జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు.మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో సుచరిత స్థానం దక్కకపోవడంతో ఆమె అనుచరులు ఆందోళనలు చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని, తన వల్ల పార్టీకి చెడ్డపేరు రాకూడదన్నారు.
నేతలంతా సంయమనం పాటించాలని, తాను పదవిలో ఉన్నా లేకపోయినా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని సుచరిత తెలిపారు. సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని, తమకు కూడా పదవులు అవసరం లేదంటూ గుంటూరు, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, కాకుమాను, పెదనందిపాడు మండలాల పరిధిలోని వైసీపీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లతో పాటు గుంటూరు నగర పాలక సంస్థకు చెందిన ఐదుగురు కార్పొరేటర్లు రాజీనామా చేస్తున్నట్లు మీడియా ముఖంగా ప్రకటించారు. పాత కేబినెట్‌లో ఐదుగురు ఎస్సీ మంత్రుల్లో నలుగురిని కొనసాగించి సుచరితను తొలగించడం ఏం న్యాయమంటూ వారు ప్రశ్నించారు. సుచరితతోపాటు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని కూడా క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని జగన్ సర్దుబాటు చేశారు.ఈ జాబితాలో మరో నేత గొల్ల బాబూరావు కూడా ఉన్నారు. జగన్ భవిష్యత్ లో తనకు పదవి ఇస్తామన్నారు.