Telugu Gateway
Politics

జనసేనలోకి చిరంజీవి!

జనసేనలోకి చిరంజీవి!
X

పవన్ కళ్యాణ్ కు తోడు చిరంజీవి వస్తారు

మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీలో చేరతారా?. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ కొత్త చర్చకు తెరతీశాయి. పవన్ కళ్యాణ్ కు తోడుగా చిరంజీవి వస్తారని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన గతంలో హామీ ఇచ్చారని అన్నారు. దీంతో చిరంజీవి జనసేనలో చేరటం ఖాయం అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తోడుగా రావటం అంటే పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇవ్వటం వంటిదే. గతంలో ప్రజారాజ్యాం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి రాజ్యసభ సభ్యత్వం తీసుకోవటంతోపాటు కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న చిరంజీవి ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ తరుణంలో నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

త్వరలోనే దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో ముందస్తుగా క్యాడర్ ను సంసిద్ధం చేసేందుకే ఈ ప్రకటన చేశారా? లేక దీని వెనక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది తేలాల్సి ఉంది. జనసేనతో పోలిస్తే చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీకే అత్యధిక శాతం ఓట్లతో పాటు సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిస్తే ఆ ప్రభావం ఏపీ రాజకీయాలపై ఏ మేరకు ఉంటుంది?. ప్రస్తుతం ఏపీలో జనసేన, బిజెపిల మధ్య పొత్తు ఉంది. చిరంజీవి కూడా వీరికి జత చేరితే ఆ ప్రభావం ఖచ్చితంగా ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Next Story
Share it