చిరంజీవికి మోడీ..పవన్ నచ్చలేదా?!
రాజకీయాలకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన నటించిన గాడ్ ఫాదర్ సినిమా రాజకీయాలతో కూడినదన్న విషయం తెలిసిందే. ఈ సినిమాతోపాటు పలు అంశాలపై చిరంజీవి దర్శకుడు పూరీ జగన్నాధ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇందులో అత్యంత కీలకమైనది ఏమిటంటే మీకు ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరు అన్న ప్రశ్నకు చిరంజీవి ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా మారింది. ఈ తరం గురించి అయితే తాను మౌనంగా ఉంటానన్నారు. అయతే పాత తరం వాళ్లలో మాత్రం లాల్ బహదూర్ శాస్త్రి అంటే తనకు ఇష్టమైన నాయకుడు అని..నిజమైన స్టేట్స్ మెన్ అంటే అటల్ బిహరీ వాజ్ పేయి అని వ్యాఖ్యానించారు. నిజంగానే వీరిద్దరి విషయంలో మెజారిటీ ప్రజలకు భిన్నాభిప్రాయం కూడా ఉండదు. అయితే ప్రజారాజ్యం పెట్టిన తర్వాత ఆయన కాంగ్రెస్ లో దాన్ని విలీనం చేసి..కేంద్ర మంత్రి పదవి దక్కించకున్న పార్టీలో ఆయనకు నచ్చిన ఈ తరం నాయకులు ఎవరూ లేకపోవటం విశేషం. నిజానికి ఆయన అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీపై లెక్కలేనన్ని విమర్శలు ఉండొచ్చు. మన్మోహన్ సింగ్ మాత్రం వివాదరహితుడు..నేరుగా ఆయనపై ఎలాంటి ఆరోపణలు కూడా లేవు.
కానీ ఆయన మాత్రం మన్మోహన్ పేరును విస్మరించారు. మరో కీలక విషయం ఏమిటంటే ప్రధాని నరేంద్రమోడీ కూడా చిరంజీవికి నచ్చలేదన్నట్లే లెక్క. సరే మోడీ విషయం కాసేపు పక్కన పెడితే కొద్ది రోజుల క్రితమే తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ నిజాయతీ, నిబద్ధత గల నాయకుడు అని..తాను చిన్నప్పటి నుంచి తనను చూస్తున్నానంటూ వ్యాఖ్యానించారు. ఏదో ఒక రోజు తన తమ్ముడికి రాష్ట్రాన్ని ఏలే రోజు వస్తుందని..రావాలని కోరుకుంటున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. అదే సమయంలో తాజాగా తలెత్తిన గరికపాటి వివాదంపై కూడా చిరంజీవి స్పందించి..ఆ పెద్దాయన చేసిన వ్యాఖ్యలపై చర్చించాల్సిన అవసరం లేదన్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవితో ఫోటోలు దిగేందుకు మహిళలు పెద్ద ఎత్తున పోటీలు పడటంతో ..గరికపాటి అసహనం వ్యక్తం చేస్తూ మీరు ఆ ఫోటో సెషన్ ఆపకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోతానంటూ వ్యాఖ్యానించటం..తర్వాత దీనిపై చిరంజీవి అభిమానుల నుంచి ఆయన తీవ్రమైన ట్రోలింగ్ ను ఎదుర్కోవటం తెలిసిందే.