Telugu Gateway
Politics

పంజాబ్ కొత్త సీఎం చ‌ర‌ణ్ జిత్ సింగ్ చ‌న్నీ

పంజాబ్ కొత్త సీఎం చ‌ర‌ణ్ జిత్ సింగ్ చ‌న్నీ
X

పంజాబ్ స‌స్పెన్స్ వీడింది. కొత్త సీఎం పేరును అధికారికంగా ప్ర‌క‌టించారు. పంజాబ్‌కు కాబోయే ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ అని ఆదివారం సాయంత్రం పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ హరీష్ రావత్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆదివారం ఆయన పంజాబ్ అసెంబ్లీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. వాస్తవానికి పంజాబ్‌కు కాబోయే ముఖ్యమంత్రులు వీరేనంటూ సుఖ్జీంద‌ర్ సింగ్ రంధావా సహా మరికొన్ని పేర్లు వినిపించాయి. అయితే వీరందరినీ కాదని చరంజిత్ సింగ్ చన్నీ పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేరు అంతగా ప్రచారంలోకి రాకపోయినా, ఆయనను కానీ, ఆయన అనుయాయులను కానీ సీఎంగా ప్రకటిస్తే అసెంబ్లీలో బలపరీక్షకు కెప్టెన్ అమరీందర్ డిమాండ్ చేసే అవకాశాలను కూడా అధిష్ఠానం పరిశీలనలోకి తీసుకున్నట్టు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే చర‌ణ్ జిత్ సింగ్ చన్నీ వైపుకు అధిష్టానం మొగ్గు చూపినట్లు సమాచారం. మ‌రికొన్ని నెల‌ల్లోనే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న త‌రుణంలో ఈ మార్పు జ‌ర‌గ‌టం విశేషం. పంజాబ్ పీసీసీ ప్రెసిడెంట్ గా సిద్ధూ నియ‌మాకం జ‌రిగిన‌ప్పటి నుంచి మాజీ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ మ‌రింత ఉక్క‌బోత‌ను ఎదుర్కొన్నారు. రెండు గ్రూపుల మ‌ధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేర‌టంతో అమ‌రీంద‌ర్ సింగ్ శ‌నివారం నాడు త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. పంజాబ్ సీఎల్పీ వెంట‌నే స‌మావేశం అయి కొత్త సీఎం ఎంపిక బాధ్య‌త‌ను అధిష్టానానికే అప్ప‌గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

Next Story
Share it