Telugu Gateway
Politics

జగన్ ఇచ్చేది గోరంత..దోచేది కొండంత

జగన్ ఇచ్చేది గోరంత..దోచేది కొండంత
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అభివృద్ధి రివర్స్ గేర్ లో వెళుతోందని ఆరోపించారు. కేసుల కోసం జగన్ కేంద్రంతో రాజీపడ్డారని..ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేదు?. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు?. 28 మంది ఎంపీలు ఉండి మీరు రాష్ట్రానికి చేసింది ఏమిటని ప్రశ్నించారు. రెండుసార్లు ఆర్డినెన్స్‌ ద్వారా బడ్జెట్‌ను పెట్టడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బడ్జెట్‌ పెట్టరా... మీ తాతా జాగీరా? అని అధికార పక్షాన్ని ప్రశ్నించారు. ఎంత ఖర్చు పెడతారు? ఎంత అప్పు తెస్తారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా అని ఆయన నిలదీశారు.ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో మాట్లాడుతూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ళు అధికారంలో ఉన్నా ఒక పరిశ్రమను కూడా జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం తీసుకురాలేకపోయిందని చంద్రబాబునాయుడు విమర్శించారు.

తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో 3ఎకరాలు కొనే పరిస్థితులు రివర్స్ అయ్యాయన్న కేసీఆర్ మాటలు అందరూ గ్రహించాలని చంద్రబాబు సూచించారు. గత రెండేళ్లలో ప్రతి కుటుంబంపై రూ.2.50 లక్షల భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు బతకలేని విధంగా అన్ని ధరలు పెంచేశారని చంద్రబాబు విమర్శించారు. 20 నెలల్లో వైసీప ప్రభుత్వం 1.70 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని అన్నారు. నాసిరకం మద్యం ద్వారా వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ పెట్టి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏపీలో పలు చోట్ల టీడీపీ నేతలు ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు.

Next Story
Share it