Telugu Gateway
Politics

అంతిమ విజ‌యం అమ‌రావ‌తి రైతుల‌దే

అంతిమ విజ‌యం అమ‌రావ‌తి రైతుల‌దే
X

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అభివృద్ధి అన్ని చోట్లా జ‌ర‌గాల‌ని...రాజ‌ధాని మాత్రం అమ‌రావ‌తిలోనే ఉండాల‌న్నారు. వెంక‌టేశ్వ‌ర‌స్వామి సాక్షిగా చెబుతున్నా అంతిమ విజ‌యం అమ‌రావ‌తి రైతుల‌దే అన్నారు. అమ‌రావ‌తి భూముల‌తోనే ఆర్ధిక వ‌న‌రులు స‌మ‌కూర్చుకుని రాజ‌ధాని అభివృద్ధి చేయ‌వ‌చ్చ‌ని తెలిపారు. చంద్ర‌బాబు శుక్ర‌వారం నాడు తిరుప‌తిలో అమ‌రావ‌తి రైతులు నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో చంద్ర‌బాబు మాట్లాడారు. ప్రాంతాల మ‌ధ్య చిచ్చుపెట్ట‌డం ఇష్టం లేక రాజ‌ధాని అమ‌రావ‌తి కి ఒప్పుకుంటున్న‌ట్లు జ‌గ‌న్ అసెంబ్లీ వేదిక‌గా ప్ర‌క‌టించి..అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మాట మార్చి రైతుల‌ను మోసం చేశార‌ని విమ‌ర్శించారు. సీఎం జగన్మోహ‌న్ రెడ్డిది చేతకాని అసమర్థ ప్రభుత్వమని చంద్రబాబు విమ‌ర్శ‌లు గుప్పించారు. రాజధాని రైతులు, మహిళల పోరాటానికి అభినందనలు తెలిపారు.

రాజధాని రైతులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని మండిపడ్డారు. మహాపాదయాత్రలో పాల్గొన్నవారిపైనా కేసులు పెట్టారని తెలిపారు. అమరావతి రాజధాని ఏ ఒక్కరికో చెందినది కాదని, ఇది ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని అని చెప్పారు. ప్రజారాజధాని అమరావతిపై మూడు ముక్కలాట ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఏపీకి అమరావతి బ్రహ్మాండమైన ఆర్థికవనరుల్ని సృష్టించగలదని చంద్రబాబు తెలిపారు. దూరదృష్టిలేని జగన్మోహ‌న్ రెడ్డి అమరావతిపై నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. అమ‌రావ‌తి భూముల విష‌యంలో ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింద‌నే ఆరోప‌ణ‌ల‌ను సుప్రీంకోర్టు కూడా తోసిపుచ్చింద‌ని చంద్రబాబు తెలిపారు. అమ‌రావ‌తి మునిగిపోతుంద‌ని దుష్ప్ర‌చారం చేశార‌ని..కానీ ఈ మూడేళ్ళ‌లో ఏనాడైనా మునిగిందా అని ప్ర‌శ్నించారు. ఈ ప్ర‌భుత్వం ఎస్సీ, ఎస్టీల‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన చేతకాని ప్ర‌భుత్వం అన్నారు.

Next Story
Share it